ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన

ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కేసులు, కోడ్ వంటి అంశాలతో ఎన్నికలకు వెళ్లలేమని పేర్కొంది. పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేయలేమని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఈనెల 31తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవీ కాలం పూర్తికానుంది.. తన పదవీ కాలం పూర్తికానుండటంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించలేమని ఆయన చెప్పారు.. తన బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు నిమ్మగడ్డ రమేష్.. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయిన వారు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందన్నారు.. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని చెప్పారు.. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.
గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక ఎన్నికల్లో పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పనిచేశారన్నారు నిమ్మగడ్డ. కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తోందని.. పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని నిమ్మగడ్డ తెలిపారు.. రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అవలంబించిన మంచి పద్ధతులను అమలు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో కూడా పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరమే పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com