ఏపీలో ప్రారంభమైన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

ఏపీలో ప్రారంభమైన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌
మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 12 కార్పొరేషన్లలోని 581 డివిజన్లు.. 71 మున్సిపాలిటీల్లోని 16వందల 33 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల బరిలో 7వేల 549 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక.. 77లక్షల 73వేల 231 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

అటు ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకూ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2వేల 320 సమస్యాత్మక, 2వేల 468 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు ఎస్‌ఈసీ. అటు.. పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీల ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి.

బ్యాలెట్‌ పత్రాలపై ఓటు వేయడంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరని ఎన్నికల అధికారులు సూచించారు. పోలింగ్‌ కేంద్రంలో సిబ్బంది మడత పెట్టి ఇచ్చిన బ్యాలెట్‌ పత్రాన్ని విప్పి.. అభ్యర్ధికి కేటాయించిన గుర్తుపై ఓటు వేశాక తిరిగి పత్రాన్ని మడత పెట్టి బాక్సులో వేసేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సిబ్బంది బ్యాలెట్‌ పత్రం ఇచ్చినప్పుడు ఎన్ని మడతలు ఉన్నాయో తిరిగి అదే విధంగా మడత పెట్టి బ్యాలెట్‌ బాక్సులో వేయాలన్నారు. ఇందులో ఏ మాత్రం పొరపడినా ఆ ఓటు తిరస్కరణకు గుర్యే అవకాశం ఉంది. ఏపీలో అందరి దృష్టి విశాఖ, విజయవాడ, గుంటూరు ఎన్నికలపైనే ఉంది.

రాష్ట్రంలో ఓటర్లుగా నమోదైన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. గవర్నర్‌పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని మోడల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుంటారు.


Tags

Read MoreRead Less
Next Story