మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన SEC
పంచాయతీ ఎన్నికలు ముగుస్తూనే మున్సిపల్ ఎలక్షన్ల నిర్వహణకు SEC షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కొనసాగించాలని నిర్ణయించి ఆ మేరకు ఉత్తర్వులిచ్చింది. గతేడాది మార్చి 15న మున్సిపల్ పోరు ఆగింది. అక్కడి నుంచే తిరిగి కొనసాగించలంటూ SEC తాజాగా షెడ్యూల్ జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మార్చి 2న మొదలవుతుంది. మార్చి 3వ తేదీ విత్‌డ్రాకి తుది గడువు. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మార్చి 13న రిజర్వ్‌డేగా పేర్కొన్నారు. మార్చి 14వ తేదీన మున్సిపోల్స్‌కు సంబంధించిన కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రానికి తుది ఫలితాలు ప్రకటిస్తారు.
మున్సిపోల్స్‌కి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించడంతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని SEC తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 పురపాలక సంఘాలకు మార్చి 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఐతే.. MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించిన విషయంలో మాత్రం ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని SEC నిర్ణయించడంతో అప్పుడే అర్బన్ పాలిటిక్స్ కూడా హీటెక్కాయి. విజయనగరం, గ్రేటర్ విశాఖ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లకు ఎన్నికలు మార్చి 10వ తేదీన జరగనున్నాయి.
పంచాయతీలతోపాటు స్థానిక ఎన్నికలను గత మార్చిలోనే చేపట్టింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. అయితే, కరోనా కారణంగా గత మార్చి 23న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటికే 12 కార్పొరేషన్లలో వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులు, స్వతంత్రులు అంతా కలిపి 6వేలా 563 మంది నామినేషన్లు వేశారు.. 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు స్థానాలకు 12 వేలా 86 మంది నామినేషన్లు వేశారు. ఇవన్నీ ఉపసంహరణ దశలో గతేడాది మార్చి 15న ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు రెండు దశలు ముగియగా.. మరో రెండు దశలు మాత్రమే మిగిలివున్నాయి.. ఆ ప్రక్రియ కూడా పూర్తయ్యాక మున్సిపోల్ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com