మున్సిపల్ ఎన్నికలపై ప్రాంతాల వారీగా ఎస్‌ఈసీ సమావేశాలు

మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని SEC నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ప్రాంతీయ సమావేశాలు జరపనున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించనున్నారు.
ఇవాళ తిరుపతిలోని ఎస్‌వీ యూనివర్సిటీ సెనేట్ హాల్‌లో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల అధికారులతో తొలి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుంచి ఐదున్నర వరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఐదు జిల్లాల్లో గుర్తింపు, రిజిస్ట్రేషన్ పొందిన రాజకీయ పార్టీల నేతలతో ఎస్‌ఈసీ సమావేశమవుతారు. ఆదివారం విజయవాడలోని తన కార్యాలయంలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో ఎస్‌ఈసీ సమావేశమవుతారు. అదే రోజు మధ్యాహ్నం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు నాలుగు జిల్లాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అవుతారు. మార్చి 1న విశాఖపట్నంలో మూడో రీజినల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో సమావేశమవుతారు. అదే రోజు మధ్యాహ్నం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం జిల్లాల్లోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ సమావేశమవుతారు.
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత, నిఘా ఏర్పాటు, మద్యం సరఫరా నివారణ, ఓటరు స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై ఆదేశాలివ్వనున్నారు SEC. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణ, కొవిడ్ నివారణ, ఓటు హక్కు వినియోగం కోసం ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం తదితర అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇస్తారు. ఈమేరకు రీజినల్ సమావేశాలకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు.
అటు ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు గడచినందున తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో నామనేషన్లు వేయనీయకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. యథావిధిగా మార్చి 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com