AP New Cabinet : ఏపీ మంత్రులందరికీ జగన్‌ షాక్‌...!

AP New Cabinet : ఏపీ మంత్రులందరికీ జగన్‌ షాక్‌...!
AP New Cabinet : ఏపీ మంత్రులందరికీ పెద్ద షాక్‌ ఇవ్వబోతున్నారు జగన్. ఇప్పుడున్న మంత్రుల్లో ఏ ఒక్కరినీ కొనసాగించబోనని తేల్చి చెప్పేశారు.

AP New Cabinet : ఏపీ మంత్రులందరికీ పెద్ద షాక్‌ ఇవ్వబోతున్నారు జగన్. ఇప్పుడున్న మంత్రుల్లో ఏ ఒక్కరినీ కొనసాగించబోనని తేల్చి చెప్పేశారు. క్యాబినెట్‌ మార్పుల్లో భాగంగా సీనియర్లు, కులాల ఈక్వేషన్లు చూసేది లేదని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. అర్థబలం ఉన్న వారైనా, అంగబలం ఉన్నవారైనా సరే.. సీటు ఖాళీ చేయాల్సిందే. గతంలో తోడుగా వచ్చిన వాళ్లు, పాదయాత్రలో తోడుగా నడిచిన వాళ్లు అనే లెక్కలేం తీసుకోవబోవడం లేదు. ఎన్నికలప్పుడు ఆర్థికంగా సహాయం చేసిన వాళ్లు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కలిసున్న వారు అని చూడడం లేదు. వందకు వంద శాతం క్యాబినెట్‌ను మారుస్తున్నారు జగన్‌. స్వయంగా బాలినేని శ్రీనివాస్‌ రెడ్డే ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈసారి క్యాబినెట్‌లో వంద శాతం కొత్త వారే ఉండబోతున్నారన్న విషయాన్ని జగనే స్వయంగా చెప్పారంటూ చెప్పుకొచ్చారు.

ఏపీలో కొత్త మంత్రులు కొలువుదీరడం ఖాయమైంది. ఇప్పుడున్న మంత్రులందరినీ తప్పిస్తానని స్వయంగా జగనే చెప్పారంటూ మంత్రి బాలినేని స్టేట్‌మెంట్ ఇచ్చారు. నిజానికి బొత్స, పెద్దిరెడ్డి, బుగ్గనతో పాటు మరికొందరిని కొనసాగిస్తారనే మాట వినిపించింది. దీంతో ఆయా జిల్లాల నేతలు మంత్రి పదవిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఎప్పుడైతే బాలినేని స్టేట్‌మెంట్‌ వచ్చిందో.. ప్రతి జిల్లా నుంచి ఆశావహులందరూ మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. మరో రెండున్నరేళ్లే కాబట్టి గట్టిగా ప్రయత్నించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే తమ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు కూడా. మరోవైపు వచ్చే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కొచ్చు అనే దానిపై పొలిటికల్‌ సర్కిల్‌లో ఓ చర్చ జరుగుతోంది.

ముందుగా శ్రీకాకుళం జిల్లా విషయానికొస్తే.. ధర్మాన కృష్ణదాసు, సీదిరి అప్పలరాజు మంత్రులుగా ఉన్నారు. తమ్మినేని సీతారాం స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. కృష్ణదాసును తప్పిస్తే ఆయన ప్లేస్‌లో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఖాయం అనే మాట వినిపిస్తోంది. కాకపోతే, ధర్మాన ప్రసాద్‌ను స్పీకర్‌గా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. తమ్మినేని సీతారాం చేసింది మంత్రిగా కాదు గనక.. ధర్మానకు స్పీకర్‌ ఛైర్ అప్పగించి తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా ధర్మాన ప్రసాద్‌కే మంత్రి పదవి ఇస్తే ఇక తమ్మినేనికి చోటు లేనట్టే అనుకోవాల్సి ఉంటుంది. ఇక సీదిరి అప్పలరాజుకు రెండున్నరేళ్ల పిరియడ్‌ ముగియలేదు. అయినా సరే, అందరినీ మారుస్తారన్నారు గనక.. తమకే అవకాశం వస్తుందని కొందరు జిల్లా నేతలు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఎస్సీ సామాజికవర్గం నుంచి కంబాల జోగులు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి కళావతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మంత్రి పదవి ఆశిస్తున్నారు.

విజయనగరం జిల్లాలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యానారాయణ పదవికి డోకా లేదని నిన్నటి వరకు వినిపించిన మాట. కచ్చితంగా పూర్తి టర్మ్ కొనసాగుతారని అనుచరులు సైతం చెప్పుకున్నారు. బాలినేని స్టేట్‌మెంట్‌ ప్రకారం బొత్స కూడా ఇంటికి వెళ్లాల్సిందే. ఇక విజయనగరం జిల్లా నుంచి పుష్ప శ్రీవాణి కూడా మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వీరిద్దరినీ మంత్రి పదవి నుంచి తప్పిస్తే.. సాలూరు నుంచి నాలుగు సార్లు గెలిచిన రాజన్నదొరకు మంత్రి పదవి దక్కవచ్చని అంటున్నారు. ఇదే జిల్లాకు చెందిన కోలగట్ల వీరభద్రస్వామి కూడా మంత్రి పదవిపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. వైశ్య కోటాలో కోలగట్లకు చోటు దక్కవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

విశాఖ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నది ఒకే ఒక్కరు. ఆయనే అవంతి శ్రీనివాస్. మంత్రులను మార్చడం ఖాయం కాబట్టి.. విశాఖ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ను పదవి వరించే అవకాశం ఉంది. లేదంటే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడుకు అవకాశం ఇవ్వొచ్చని వినిపిస్తోంది. ఇక ఎస్సీ కోటాలో గొల్ల బాబూరావు కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. విశాఖ జిల్లాలో ఏం జరిగినా ఎంపీ విజయసాయిరెడ్డికి తెలియకుండా జరగదనే నానుడి చాలా బలంగా వినిపిస్తోంది. సో, విజయసాయిరెడ్డి ఏ పేరు చెబితే అదే జగన్‌ వింటారని మాట్లాడుకుంటున్నారు. పార్టీలో సెకండ్‌ ప్లేస్‌ విజయసాయిరెడ్డిదేనని ఇప్పటికీ కొందరు నమ్ముతున్నారు. ఆ రకంగా చూస్తే విజయసాయిరెడ్డి చెప్పిన వారికే మంత్రి పదవి దక్కొచ్చేమో.

తూర్పు గోదావరి జిల్లా నుంచి కాపు, SC, BC సామాజిక వర్గాల వారిని కేబినెట్‌లోకి తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే, కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నబాబు, శెట్టి బలిజ వర్గం నుంచి చెల్లుబోయిన వేణుగోపాల్, SC సామాజిక వర్గం నుంచి విశ్వరూప్‌ మంత్రులుగా ఉన్నారు. కాపు కోటాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే.. జక్కంపూడి రాజాను మంత్రి వర్గంలో తీసుకుంటారని తెలుస్తోంది. ఏమైనా మార్పుంటే తుని ఎమ్మెల్యే రాజాకి అవకాశం ఉంటుంది. ఇక మత్స్యకార వర్గం నుంచి పొన్నాడ సతీష్‌కు ఛాన్స్‌ ఇవ్వొచ్చని చెప్పుకుంటున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఆళ్ల నాని మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మహిళా కోటాలో మంత్రిగా తానేటి వనిత ఉన్నారు. ఇక క్షత్రియ సామాజికవర్గం నుంచి మంత్రి రంగనాథరాజు కూడా మంత్రిగా ఉన్నారు. క్షత్రియ సామాజికవర్గం కోణంలో ఆలోచిస్తే.. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుకు అవకాశం రావొచ్చని చెప్పుకుంటున్నారు. మరోవైపు పవన్‌ను ఓడించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గ్రంధి శ్రీనివాస్‌ సైతం ఈసారి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సైతం మంత్రి రేసులో ఉన్నారు. కమ్మ సామాజికవర్గంలోని కొడాలి నానీని సైతం మంత్రి పదవి నుంఇ తప్పిస్తారు కాబట్టి.. అబ్బయ్యకు అవకాశం దక్కినట్టే అనుకుంటున్నారు. అయితే, కమ్మ కోటాలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎస్టీ సామాజికవర్గం నుంచి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఒకవేళ ఉత్తరాంధ్ర నుంచి ఎస్టీలకు మంత్రి పదవి దక్కకపోతే బాలరాజును అదృష్టం వరిస్తుందని లెక్కలేస్తున్నారు.

కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. కాపు వర్గం నుంచి పేర్నినాని, కమ్మ వర్గం నుంచి కొడాలి నాని, వైశ్య వర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ రెండున్నరేళ్లు మంత్రులుగా ఉన్నారు. ఈసారి ఏర్పాటయ్యే క్యాబినెట్‌లో పేర్ని నాని స్థానంలో సామినేని ఉదయభానుకు మంత్రి పదవి రావొచ్చంటున్నారు. జిల్లాల లెక్కలు పక్కన పెట్టి వైశ్య సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే.. ప్రజాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు లేదా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇక విజయవాడ సెంట్రల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాది విష్ణు సైతం మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కోన రఘుపతిని కొనసాగిస్తే మాత్రం మల్లాది విష్ణుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని అంటున్నారు. ఇక బీసీ కోటా పరంగా చూసినా, జిల్లా లెక్కలు తీసుకున్నా కొలుసు పార్దసారథికి పదవి ఖాయంగానే కనిపిస్తోంది. మొన్న చంద్రబాబు ఇంటిపైకి వెళ్లి నానా గలాటా చేసిన జోగి రమేష్‌కు క్యాబినెట్‌ బెర్త్‌ ఖాయం అంటున్నారు. ఈ ఎపిసోడ్‌ను జగన్‌ కూడా మెచ్చుకోవడంతో జోగి రమేష్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కృష్ణా జిల్లా నుంచి ఎస్సీ కోటాలో భాగంగా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మంత్రి పదవి ఆశిస్తున్నారు.

గుంటూరు జిల్లా విషయానికి వస్తే.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సుచరిత హోంమంత్రి పదవిలో ఉన్నారు. ఈ జిల్లా నుంచి రెడ్డి కోటాలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. జగన్‌ అడిగిన వెంటనే చిలుకలూరిపేట సీటు వదులుకున్న మర్రి రాజశేఖర్ ఈసారి మంత్రి పదవి రేసులోకి వచ్చారు. ఎమ్మెల్సీతో మంత్రి పదవి ఇస్తారనే ఆశ పెట్టుకున్నారు. కాపు కోటాలో సీనియర్ నేత అంబటి రాంబాబు ఈసారి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. జంగా కృష్ణమూర్తి సైతం గంపెడు ఆశతో ఉన్నారు.

ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ మంత్రులుగా ఉన్నారు. ఈ జిల్లా నుంచి వైశ్య కోటాలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పదవి ఆశిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రకాశం జిల్లా తరపున ఆదిమూలపు మంత్రిగా ఉన్నారు. ఒకవేళ ఎస్సీ కోటా నుంచి మంత్రిని తీసుకోవాల్సి వస్తే.. ఈసారి ప్రకాశం జిల్లా నుంచి కాకుండా తూర్పు, పశ్చిమ, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు చెందిన ఒక ఎస్సీ నేతకు పదవి దక్కుతుందని లెక్కలేస్తున్నారు.

నెల్లూరు జిల్లా నుంచి మంత్రులుగా అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి ఉన్నారు. ఒకవేళ యాదవ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వదలిస్తే.. కృష్ణా జిల్లాకు చెందిన పార్ధసారథి అనిల్ కుమార్‌ ప్లేస్‌ను భర్తీ చేస్తారని చెప్పుకుంటున్నారు. మేకపాటి గౌతంరెడ్డి ప్లేస్‌లో కాకాణి గోవర్దన్ రెడ్డిని తీసుకుంటారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణరెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. ఎన్నికల నాటికి బాగా అనుభవం ఉన్న నేతలే కావాల్సి వస్తే మాత్రం.. ఆనం రామనారాయణ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ దక్కొచ్చని చెప్పుకుంటున్నారు.

జిల్లాకు పెద్ద దిక్కు అనిగాని, ఉత్తరాంధ్ర-రాయలసీమలో ధీటైన నాయకులు అనిగాని చూడబోవడం లేదు జగన్. ఎంతవారలైనా సరే.. కుర్చీ ఖాళీ చేసి తీరాల్సిందేనని చెబుతున్నారు. మొత్తంగా ఈసారి కూడా జగన్‌ మార్క్‌ క్యాబినెట్టే రాబోతోంది. ఇందులో రెండో వ్యక్తి ప్రమేయం గాని, పైరవీలు గానీ ఉండబోవని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఏ నిర్ణయమైనా తనదే కావాలన్న ఓ ప్రణాళికతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కాలం గడిచే కొద్దీ ఎన్నికలకు దగ్గరవుతుండడంతో.. ఈసారి ఒత్తిళ్లు, ప్రేమలు పనిచేయవని కూడా చెప్పుకుంటున్నారు.


Tags

Read MoreRead Less
Next Story