ఏపీకి మరో ఆర్థిక భారం తప్పదా..?

ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతవుతున్న ఏపీపై ఇప్పుడు మరో అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకయ్యే ఖర్చు తడిపి మోపిడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజన, ఆఫీసుల ఏర్పాటు, ఆస్తుల పంపిణీ, ఇతర మౌలిక వనరుల కల్పనకు భారీగా వ్యయమయ్యే అవకాశం ఉండడంతో ఆయా అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరి నాటి అంచనాల ప్రకారం సుమారు 1,300 కోట్ల రూపాయల వ్యయమవుతుందని ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు సమాచారం..
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనకు సీఎస్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీతో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఆర్థిక వనరులతో పాటు ఉద్యోగులు, ఆస్తుల కేటాయింపు, ఆఫీసులను సమకూర్చుకోవడం లాంటి అనేక అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. దీంతో జిల్లాల ఏర్పాటు అన్ని కోణాల్లో పూర్తిచేయడానికి కనీసం 1,300 కోట్లు రూపాయలు ఖర్చు కానుందని ఈ ఏడాది జనవరిలోనే సీఎంకు నివేదిక ఇచ్చారు అధికారులు. అప్పటికి ఇంకా జిల్లాల ఏర్పాటు ఎలా ఉండాలి? వనరుల వినియోగంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. అయితే మరి అంత భారం భరించే పరిస్థితి ఉందా అన్నది ఆందోళన పెంచుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటే పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్నామని.. ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకని. కాబట్టి మోయలేని ఆర్థిక భారాలు వద్దని.. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవాలని సీఎం అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే అద్దె భవనాలను ఎంపికచేయండి అని సీఎం అన్నట్టు సమాచారం. అలాగే రాజకీయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకునే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. కొత్త జిల్లాల పేరుతో ఇంత భారం మోపడం సరైంది కాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు..
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com