ఏపీ పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టు తుది తీర్పు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ప్రభుత్వ అభ్యంతరంతో ఆ షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ ఈ నెల 11న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే ఆ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విని తీర్పును వాయిదా వేసింది ధర్మాసనం.
మంగళవారం ధర్మాసనం ముందు వాడివేడిగా వాదనలు సాగాయి. ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు పలు కీలక అంశాలను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షల సడలింపు క్రమంగా పెరుగుతోందని, ఆంక్షల సడలింపులో ఐదో దశలో ఉన్నామని వివరించారు.
కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎవరి కార్యకలాపాలు వారు చేసుకుంటున్నారన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనా క్రమేపీ తగ్గుతోందన్నారు. ఈ తరుణంలో ఎన్నికలు నిర్వహించటానికి ఉన్న అడ్డంకులు ఏమిటో అర్థం కావడం లేదని ప్రస్తావించారు.
రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ ప్రయత్నిస్తోంది తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహిస్తే వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేర్కొన్నారు.
ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇరు వర్గాలు వాదనలు విన్న ధర్మాసనం.. నేటికి తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. ఈ తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com