హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జగన్ ప్రభుత్వం

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం పేర్కొంది. అటు.. ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
రాజ్యాంగం ప్రకారం స్థానిక ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ విధి అని, ఎస్‌ఈసీకి తప్పనిసరిగా ప్రభుత్వం సహకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్‌ఈసీకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. అప్పుడే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయని పేర్కొంది.
భారత ఎన్నికల సంఘాని ఉన్న అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఉన్నాయని పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది.. ఎన్నికల కమిషనే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రకృతి వైపరిత్యాలు, శాంత్రిభద్రతలకు విఘాతం కలిగే సమయంలో ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు.. ప్రభుత్వ నిర్ణయంపై విపక్ష తెలుగుదేశం తీవ్రంగా మండిపడింది. డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఉంటే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగవని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సవాంగ్‌ను బాధ్యతల నుంచి ఎస్‌ఈసీ తప్పించాలని డిమాండ్ చేశారు. సమర్థుడు, నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిని డీజీపీగా పెట్టాలని డిమాండ్ చేశారు. డీజీపీ పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే గౌతమ్ సవాంగ్ టీడీపీ పట్ల వ్యతిరేక ధోరణితో ఉన్నారని ఆరోపించారు.
అటు.. పంచాయతీ ఎన్నికలపై వరుస పరిణామాలతో.. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో తదుపరి పరిణామాలపైనా మరింత ఉత్కంఠ ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com