పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం, ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు

పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం, ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కలిసి కూర్చుని.. మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకే మౌఖికంగా ఆదేశాలిచ్చిన ధర్మాసనం.. నిన్న లిఖితపూర్వక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంప్రదింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి హోదా తగ్గని అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆర్డర్ కాపీ అందుకున్న మూడు రోజుల్లోనే ఎన్నికల కమిషనర్‌ చర్చల వేదికను నిర్ణయించి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో సంప్రదింపులు జరపాలని తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఇచ్చిన సూచనలు, మార్గదర్శకాలను, తన వాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీకి లిఖితపూర్వకంగా అందించాలని కూడా కోర్టు ఆదేశించింది.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఎస్‌ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, కరోనా సెకండ్‌ వేవ్, వ్యాక్సినేషన్ పేరుతో ఎన్నికలు వాయిదా వేయాలంటూ పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం, ఎస్‌ఈసీ వాదనలు విన్న హైకోర్టు.. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంది. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా.. ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని సూచించింది.

ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని కోర్టు తెలిపింది. అలాగే ఇంతవేగంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన విషయంపై.. ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వానికి వివరించాలని సూచించింది.


Tags

Read MoreRead Less
Next Story