ఏపీలో పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీలో పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగిన చోట నుంచి తిరిగి మొదలుపెట్టేలా SECకి ఆదేశాలు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

పరిషత్‌ ఎన్నికలు వెంటనే నిర్వహించాలంటూ తాము SECకి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో కమిషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఎన్నికల నిర్వహణ బాధ్యత కమిషన్‌దే తప్ప.. ఇతరులు నిర్దేశించలేరన్న సీనియర్ న్యాయవాది అశ్విన్ కుమార్‌ వాదనను సమర్థించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని SECకి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. MPTC, ZPTC ఎన్నికలు జరిపేలా SECని ఆదేశించాలన్న పిటిషన్లపై.. తదుపరి విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది.

పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పూర్తైనందున.. త్వరగా MPTC, ZPTC ఎన్నికలు కూడా ఇదే క్రమంలో పూర్తి చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై కొన్నాళ్లుగా వాదనలు జరుగుతున్నాయి. గతేడాది నోటిఫికేషన్ ఇచ్చి, ఆ ప్రక్రియ సగంలో ఉన్నప్పుడు కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయని వాటిని వెంటనే పూర్తి చేయాలని పిటిషనర్లు కోరారు. ఆగిన చోట నుంచి తిరిగి మొదలుపెట్టేలా SECకి ఆదేశాలు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఐతే.. కోర్టు SEC విధుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పడంతో ఇప్పుడేం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈనెలాఖరు 31న నిమ్మగడ్డ రిటైర్ అవుతున్నారు. హైకోర్టులో ఈ కేసుల్ని 30వ తేదీకి వాయిదా వేసింది. దీన్ని బట్టి చూస్తే.. నిమ్మగడ్డ వెళ్తూ వెళ్తూ ఈ ఎలక్షన్‌ కొనసాగింపునకు ఆదేశాలు ఇస్తారు అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. దీనిపై నిర్ణయం తీసుకోకుండానే ఆయన రిటైరైతే కొత్త కమిషనర్ వచ్చాకే ప్రాదేశిక పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Tags

Next Story