CM RAMESH: బతికుంటే కదా పోటీ చేసేది

సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో వైకాపాకు కంట్లో నలుసుగా మారిన తెలుగుదేశం ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి హత్యకు కుట్ర పన్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ నెల 14న బీటెక్ రవి అరెస్టు సందర్భంగా బతికుంటేనే కదా పులివెందులలో పోటీ చేసేది నిన్ను, సునీతను చంపేస్తే దిక్కెవరు అంటూ పోలీసులు బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడించడం దుమారం రేగుతోంది. పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు.
పులివెందుల తెదేపా ఇన్‌ఛార్జి బీటెక్ రవిని పోలీసులు ఈ నెల 14న కిడ్నాప్ చేసి, చంపడానికి ప్రయత్నించారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ రోజు ఆయనను కిడ్నాప్ చేసి 3 గంటల పాటు చీకట్లో తిప్పుతూ చివరకు ఓ గదిలో నిర్బంధించి, చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. కిడ్నాప్ వార్తలు మీడియాలో రావడంతో.. చివరకు వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించి, తప్పుడు కేసు నమోదుచేశారని విమర్శించారు. కడప జైల్లో రిమాండులో ఉన్న బీటెక్ రవిని ములాఖత్ ద్వారా ఎంపీ కలిశారు. బీటెక్ రవి కిడ్నాప్ అంటూ మీడియాలో ప్రచారం రావడంతోనే ఆయన బతికి బట్టకట్టారని... సంచన ఆరోపణలు చేశారు. పులివెందుల నుంచి కడప వస్తున్న బీటెక్ రవి వాహనాలను తనిఖీ పేరిట యోగి వేమన విశ్వవిద్యాలయం సమీపంలో ఆపగా.. కిందకు దిగిన ఆయన్ను సీఐ అశోక్‌రెడ్డి బృందం మరో వాహనంలో ఎక్కించుకుని అపహరించింది. పలు ప్రాంతాల్లో చీకట్లో తిప్పుతూ ఓ పాడుబడిన గదిలోకి తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నిస్తుండగా కిడ్నాప్ అంటూ మీడియాలో ప్రచారం రావడంతో చివరకు వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించి కేసు నమోదుచేశారని భాజపా ఎంపీ సీఎం రమేష్ చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా...? తెదేపా, భాజపా కలిసి పోటీ చేయడానికి సీఎం రమేష్ కృషిచేస్తున్నారా...? అనే విషయాలపై పోలీసులు ప్రశ్నించినట్లు బీటెక్ రవి తెలిపారన్నారు. సీఐ అశోక్‌రెడ్డి వైకాపా కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని... ఆయన వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామని సీఎం రమేష్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పోరాడాలని.. మంచి చేస్తే ప్రజలకు చెప్పుకోవాలని, అంతేగానీ ఈ విధంగా అరాచకాలు సృష్టించడం సరికాదని సీఎం రమేష్ అన్నారు. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని.. పోలీసులు హద్దులు మీరి పని చేస్తున్నారని ఆరోపించారు. రోజులు దగ్గర పడ్డాయని విచారణ చేస్తే ఉద్యోగాలు పోతాయన్నారు. ఒకరి కోసం ఉద్యోగాలు పొగొట్టుకుని బలి కావొద్దని.. పోలీసులు చిన్న చిన్న లాభాల కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఉద్యోగాలు పోగోట్టుకోకండని సీఎం రమేష్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com