ఏపీలో ఏ రోడ్డు చూసినా అధ్వాన్నం..

ఏపీలో ఏ రోడ్డు చూసినా అధ్వాన్నం..
సర్వం గుంతలమయం. తారు రోడ్లపైనే మోకాలు లోతు గుంతలు ఉన్నాయంటే.. ఇక మట్టి రోడ్ల సంగతి చెప్పక్కర్లేదు.

ఏపీలో ఏ రోడ్డు చూసినా అధ్వానమే. సర్వం గుంతలమయం. తారు రోడ్లపైనే మోకాలు లోతు గుంతలు ఉన్నాయంటే.. ఇక మట్టి రోడ్ల సంగతి చెప్పక్కర్లేదు. ఏకంగా బురద గుంటలను తలపిస్తున్నాయి. రాష్ట్ర హైవేలు, మున్సిపాలిటీ రోడ్లు, మండలాల రోడ్లు, పంచాయతీల్లోని రోడ్లు.. ఇలా రాష్ట్రంలో ఏ ప్రాంతం చూసినా గుల్లగుల్ల అయిన గుంతల రోడ్లే కనిపిస్తున్నాయి. దీనికి తోడు వర్షాలు కూడా పడడంతో.. ఏ గొయ్యి ఎంత లోతున ఉందో కూడా తెలియని పరిస్థితి. కేవలం పది కిలో మీటర్ల ప్రయాణానికి ఏకంగా అర గంట సమయం పడుతోంది.

రోడ్లు వేయక రెండున్నరేళ్లు కావడంతో.. ఆర్‌ అండ్‌ బి డిపార్ట్‌మెంట్‌ రోడ్లు వేయాలన్న విషయాన్నే మరిచిపోయినట్టుంది. మరోవైపు కాంట్రాక్టర్లు సైతం రోడ్లు వేసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే, కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రావాల్సినవే రాకపోవడంతో.. ఇకపై చేసే పనులకు బిల్లులెప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండడంతో.. కాంట్రాక్టర్లు ఆమడ దూరంలో ఉంటున్నారు. కనిపిస్తే రోడ్ల కాంట్రాక్టు చేతిలో పెడతారన్న భయంతో అటువైపు కూడా వెళ్లడం లేదు.

108లో వెళ్లే రోగుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంబులెన్సులను తీసుకొచ్చింది గాని.. అవి సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితి. గుంతల రోడ్లపై వెళ్తున్న రోగులు, గర్భిణిల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోడ్ల పరిస్థితి చూసి ప్రయాణాలు మానుకుంటున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఏపీ రోడ్లపై ప్రయాణిస్తే రోగులుగా మారే ప్రమాదం ఉందని చెప్పి పెళ్లిళ్లు, జాతరలకు కూడా వెళ్లడం లేదు జనం. పుంగనూరు నియోజకవర్గం బోయకొండ గంగమ్మ దేవాలయానికి కాస్త ధైర్యం చేసి వెళ్లిన భక్తులైతే నరకయాతన అనుభవించారు. కర్నాటక భక్తులు బోయకొండకు అధిక సంఖ్యలో వెళ్తుంటారు.

Tags

Read MoreRead Less
Next Story