ఎన్నికలలో జరిగే అక్రమాలకు 'యాప్‌'తో చెక్ : నిమ్మగడ్డ

ఎన్నికలలో జరిగే అక్రమాలకు యాప్‌తో చెక్ : నిమ్మగడ్డ
ఈ-యాప్‌ కచ్చితంగా విజయవంతమవుతుందని నిమ్మగడ్డ రమేష్ తెలిపారు.

ఎన్నికలలో మద్యం, డబ్బు, అక్రమాలపై ప్రత్యేక నిఘా కోసం యాప్‌ను రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ-వాచ్ పేరుతో నిఘా యాప్ రిలీజ్‌ చేశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ఈ-యాప్‌ ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. ఫోన్ నెంబర్ ద్వారా ఫిర్యాదుదారుడి ఐడెంటిటీని గుర్తిస్తామని.. కంప్లైంట్ వచ్చాక సీరియస్, నాన్ సీరియస్‌గా కాల్ సెంటర్‌లో విభజిస్తారని తెలిపారు. ఫిర్యాదు సరిగా పరిష్కారం కాకపోతే రీఓపెన్ ఆప్షన్ ఉంటుందన్నారు. యాప్ సెక్యూరిటీ ఆడిట్‌ను మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని, సెగ్రిగేషన్‌ను ఎస్ఈసీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు.

ఎన్నికల్లో చోటుచేసుకునే అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా ఫిర్యాదుకు అవకాశం కల్పించామన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా గోప్యంగా ఉంచుతామని.. ఫిర్యాదులను పరిష్కరించినట్లు మళ్లీ తెలియజేస్తామన్నారు. రేపటి నుంచి ప్లేస్టోర్‌లో యాప్‌ అందుబాటులో ఉంటుందని.. ఈ-యాప్‌ కచ్చితంగా విజయవంతమవుతుందని నిమ్మగడ్డ రమేష్ తెలిపారు.

ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకం కాదన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అసాధారణంగా జరిగే ఏకగ్రీవాలపైనే తాము దృష్టి పెడతామన్నారు. మొక్కుబడిగా ఎన్నికలు జరగకుండా.. పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో సమన్వయంగా కలిసి అధికారులు పనిచేయాలన్నారు నిమ్మగడ్డ రమేష్.

ఇక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నానని ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. జిల్లాల అధికారులకు ఎన్నికలపై సూచనలు చేస్తున్నామన్నారు. సీరియస్ కంప్లైంట్స్‌ను జిల్లా అధికారులు సత్వరమే పరిష్కరించాలని.. లేకుంటే ఎన్నికలు నిలిపివేయాల్సి వస్తుందని అధికారులను నిమ్మగడ్డ ఆదేశించారు. జిల్లాల్లో చక్కిటి వాతావరణం ఉందని.. కొన్ని చెదురుమదురు సంఘటనలు తప్ప.. అంతా సవ్యంగానే జరుగుతుందన్నారు నిమ్మగడ్డ.

మరోవైపు ఏపీలో రేషన్‌ డెలివరీ వాహనాలను ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ తనిఖీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయవాడ ఎస్‌ఈసీ కార్యాలయానికి రేషన్ వాహనాలను పౌర సరఫరాల శాఖ అధికారులు తీసుకొచ్చారు. వాహనాలపై ఉన్న రంగులను, ఫొటోలను ఎస్‌ఈసీ పరిశీలించారు. వాహనంలోని సదుపాయాలను అధికారులు ఎస్‌ఈసీకి వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story