జీఏడీ పొలిటికల్ సెక్రటరీని బదిలీ చేయాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశం
ఏపీ ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా.. సీఎస్‌కు..ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌ను ఎన్నికల విధులనుంచి తొలగించాలని ఆదేశించారు. అంతే కాకుండా ఆయన్ను బదిలీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 23న కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ జరగకపోవడానికి ప్రవీణ్ ప్రకాష్ బాధ్యుడని, కలెక్టర్లకు, ఎస్పీలకు ఎస్‌ఈసీ సమావేశాలకు హాజరు కావద్దని ప్రవీణ్ ప్రకాష్ సూచనలు చేశారని ఈ లేఖలో తెలిపారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
పోలింగ్ ప్రక్రియకు సహకరించొద్దని ప్రవీణ్ ప్రకాష్..అధికారులను ఆదేశించారని, అందువల్లే తొలిదశ ఎన్నికల్ని రీషెడ్యూల్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తొలిదశ నామినేషన్లు స్వీకరించకపోవడానికి ప్రవీణ్ ప్రకాషే బాధ్యుడని, గతంలోనూ రంగారెడ్డి, విశాఖ కలెక్టర్‌లుగా పని చేసినప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రవీణ్ ప్రకాష్‌పై చర్యలు తీసుకుందని లేఖలో పేర్కొన్నారు.
ఆర్టికల‌్ 243 రెడ్ విత్ ఆర్టికల్ 324 సంక్రమించిన అధికారాల ప్రకారం ప్రవీణ్ ప్రకాష్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించామని, ఎన్నికలకు సంబంధించిన అంశాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలెక్టర్లు,ఎస్పీలు, ఇతర ఏ అధికారులతో ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడకూడదని ఆదేశించారు ఎస్‌ఈసీ. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com