"ట్రస్టు ఆస్తులను కొట్టేసేందుకు వైకాపా లీడర్ల కుట్ర"

రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని డీజీపీకీ లేఖ రాశారు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. రూ. 100 కోట్ల విలువైన ముప్పవరపు చౌదరి- లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టు ఆస్తులను కొట్టేసేందుకు వైకాపా నాయకులు కుట్రపన్నారని లేఖలో పేర్కొన్నారు. పేదలకు సేవ చేసేందుకు ముప్పవరపు లీలా రామకృష్ణప్రసాద్ 1999 లో ట్రస్టు స్థాపించారని తెలిపారు. ట్రస్టు సభ్యులైన కుదురవల్లి రాధాకృష్ణ, కుదురవల్లి శ్రీనివాసరావు, మల్లిపెద్ది చిత్తరంజన్, కన్నెగంటి బసవపూర్ణయ్య, ముప్పవరపు హేమంత్ లు అధికారపార్టీ నాయకుల ప్రోద్బలంతో అక్రమ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్.ఆర్.ఐ లైన ట్రస్టు సభ్యులను కోర్టు ఆవరణలో కిడ్నాప్ చేసేందుకు నిందితులకు ఒక వర్గం పోలీసులు సహకరించారని అన్నారు అచ్చెనాయుడు. ప్రక్క రాష్ట్రాల్లో పత్రికా సమావేశాలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంపై దృష్టిపెట్టడం లేదని ఫైర్ అయ్యారు. పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రస్టు ఆస్తుల వ్యవహారంపై, ట్రస్టు సభ్యులపై అక్రమ కేసుల నమోదు, ట్రస్టు ఆస్తులు కాజేయాలని చూసే అధికారపార్టీ నేతలకు సహకరిస్తున్న పోలీసు అధికారులపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోండని తెలిపారు. పోలీసులపై ప్రజల్లో నమ్మకం కలుగేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com