టీడీపీ నేత, సంగం ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

టీడీపీ నేత, సంగం ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
ఈసారి తెలుగుదేశంలో మరో కీలక నేత టార్గెట్ అయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన TDP ముఖ్యనేత, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రను ACB అధికారులు అరెస్టు చేశారు.

ఈసారి తెలుగుదేశంలో మరో కీలక నేత టార్గెట్ అయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన TDP ముఖ్యనేత, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రను ACB అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయాన్నే పొన్నూరు మండలం చింతలపూడిలోని నరేంద్ర నివాసానికి భారీ బందోబస్తుతో చేరుకున్న ACB టీమ్.. ఆయన్ను అదుపులోకి తీసుకుంది. తర్వాత బాపట్ల నుంచి కర్లపాలెం మీదుగా విజయవాడ తీసుకువెళ్లారు. సంగం డెయిరీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయనే ఆరోపణలే ఈ అరెస్టుకు కారణంగా తెలుస్తోంది.

దాదాపు 100 మంది పోలీసులతో అక్కడికి చేరుకుని.. 7 గంటలకు ఆయన్ను అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. ధూళిపాళ్లపై 408, 409, 418, 420, 465,471 సెక్షన్లతోపాటు.. 120-B రెడ్‌విత్‌ 34 కింద కేసులు నమోదు చేశారు. నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టిన నేపథ్యంలో.. దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠకరంగా మారింది. ఇదే కేసులో సంగం డెయిరీ MDని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నరేంద్రను అరెస్టు చేస్తున్నారనే వార్తలతో అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకునే ప్రయత్నం చేశారు. ఐతే.. పోలీసులు వారందరినీ అడ్డుకున్నారు. సంగం డెయిరీని దెబ్బతీసి అమూల్‌కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ధళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. గుజరాత్‌కు చెందిన అమూల్‌తో లోపాయకారీ ఒప్పందాలు చేసుకుని ఇక్కడి సంస్థల్ని దెబ్బతీయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలు బయటకు వస్తున్న ప్రతిసారీ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమల లాంటి నేతల్ని కావాలనే వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణం నరేంద్రను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ అరెస్టు, ఉద్రిక్త పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. నరేంద్ర కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ అరెస్టు అక్రమమని, కావాలని కక్ష సాధిస్తున్నారని.... పార్టీ పూర్తిగా అండగా ఉండి పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ప్రజల ప్రాణాలు గాలికొదిలేసిన ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో రాక్షసానందం పొందుతోందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్‌ రెడ్డి చేస్తున్న అన్యాయం చట్టం ముందు ఎప్పుడూ విజయం సాధించదని లోకేష్ అన్నారు. ప్రభుత్వ అక్రమాల్ని ప్రశ్నిస్తున్నందుకే ఇప్పుడు ధూళిపాళ్లను టార్గెట్ చేశారని ఆరోపించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, ఎన్నో సేవాకార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం సిగ్గుచేటన్నారు. YCP యూనిఫామ్ వేసుకున్న కొంత మంది పోలీసులకు కోర్టులో మరోసారి అక్షింతలు తప్పవని అన్నారు.

రాజకీయ జీవితంలో మచ్చలేని నేతను అక్రమంగా అరెస్టు చేసి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పాల ఉత్పత్తిదారుల అభివృద్ధికి, సంగం డెయిరీని ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి నిరంతరం కృషి చేసిన వ్యక్తిని ఇలా దుర్మార్గంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. గుజరాత్‌కు చెందిన అమూల్‌ కోసమే సంగం డెయిరీని దెబ్బకొట్టే ప్రయత్నాల్ని జగన్ చేస్తున్నారని అచ్చెన్న విమర్శించారు.

Read MoreRead Less
Next Story