AP:3వేల కోట్లు ఈ నెలలోగా చెల్లిస్తాం..ఉద్యోగ సంఘాలకు మంత్రుల కమిటీ హామీ

AP:3వేల కోట్లు ఈ నెలలోగా చెల్లిస్తాం..ఉద్యోగ సంఘాలకు మంత్రుల కమిటీ హామీ
ఆర్జిత సెలవులు, డీఏ బకాయిలను ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు రెండు విడతల్లో చెల్లిస్తామని చెప్పింది

ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో 3వేల కోట్ల రూపాయలను ఈ నెల 31లోపు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. ఆర్జిత సెలవులు, డీఏ బకాయిలను ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు రెండు విడతల్లో చెల్లిస్తామని చెప్పింది. సచివాలయంలో ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై ఏపీ ఐక్య కార్యచరణ సమితి, ఏపీ ఐక్య కార్యచరణ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నాయకులతో మంత్రుల కమిటి నాలుగు గంటలపాటు చర్చించారు.

వీఆర్‌ఏలు, ఏఎన్‌ఎంలకు ఫేస్ రికగ్నిషన్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘం నేతలు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణకు, బొప్పరాజు వెంకటేశ్వర్లుకు మధ్య కొంత వాగ్వాదం కొనసాగింది. ఒకానొక దశలో బయటకు వెళ్లిపోతానని మంత్రి బొత్స.. తామూ వెళ్లిపోతామని బొప్పరాజు అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో జీతభత్యాలకు ఏటా 90 వేల కోట్లు అవసరం అవుతున్నాయని, ప్రతి ఏడాది 10వేల కోట్లు అదనంగా పెరుగుతోందని మంత్రి బుగ్గన వెల్లడించారు. అయితే ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులకు చెల్లిస్తున్న మొత్తాలు ఉన్నాయని, గత ప్రభుత్వాల్లోనూ ఉద్యోగులకు జీతాలు చెల్లించారని నేతలు సమాధానమిచ్చారు. పీఆర్సీ డీఏ బకాయిలు 5వేల కోట్లపై ఎలాంటి కసరత్తు చేయలేదని మంత్రుల కమిటీ వెల్లడించింది. ఆరోగ్య కార్డులపై ఈనెల 16న నిర్వహించనున్న సమావేశంలో వీటిపైనా చర్చిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు ఉద్యమ కార్యాచరణ యధావిధిగా జరుగుతుందన్నారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు. త్వరలో కార్యవర్గ సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. పెండింగ్ డీఏలపై కసరత్తు చేయలేదని ప్రభుత్వం చెప్పిందన్నారు. పెండింగ్ డీఏల బకాయిలే ఎక్కువగా ఉంటాయన్నారు. కీలక అంశాలపై ప్రభుత్వంతో చర్చలు జరిపామన్నారు. మార్చి 2022లోగా సీపీఎస్ అంశంపై స్పష్టత ఇస్తామన్నారని.. కానీ 2023 మార్చి వచ్చేసిందన్నారు బొప్పరాజు. ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశామన్నారు బండి శ్రీనివాసరావు. ఇక.. 16వేల కోట్ల బిల్స్ పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story