APSRTC: తిరుమల కొండకూ ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నెలవారీ ఖర్చులు ఆదా అవుతాయని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపైకి వెళ్లే మహిళా భక్తులకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఘాట్‌రోడ్డు అయినందున ఆ బస్సుల్లో సిటింగ్ వరకే అనుమతి ఉంటుందని చెప్పారు. అయితే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదని కొనకళ్ల పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల కొండపై వరకు పొడిగించినట్లు చెప్పారు. అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల సిటింగ్ వరకే అనుమతి ఇస్తున్నామన్నారు. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. " మొదట తిరుమల వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించదని తెలిపాం. కానీ మహిళల కోరిక మేరకు సీఎం చంద్రబాబు కొండపైకు వెళ్లే బస్సుల్లో కూడా అవకాశం కల్పించారు. అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల సిటింగ్ వరకే అనుమతి ఇస్తున్నాం. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మహిళలు అంచనాలకు మించి ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు. ఈ స్త్రీ శక్తి పథకంతో మహిళలకు రోజుకు రూ.6.30 కోట్లు లబ్ధి చేకూరుతోంది. అని కొనకళ్ల నారాయణ తెలిపారు.
రోజుకు రూ.6.30 కోట్లు లబ్ధి
స్త్రీ శక్తి - మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అపూర్వ స్పందన లభిస్తోందని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఏపీలో ఈ నెల 16న 10 లక్షల మంది, 17న 15 లక్షల మంది, 18న 18 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని వివరించారు. ఈ పథకం ద్వారా మహిళలకు రోజుకు రూ.6.30 కోట్లు లబ్ధి చేకూరుతోందన్నారు. ముఖ్యంగా ఆసుపత్రులకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు, చిరుద్యోగాలు చేసే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని నారాయణ చెప్పారు. అంతకు ముందు ఆయన పలువురు మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఆధార్ కార్డులు పరిశీలించి, వారికి ఉచిత ప్రయాణ టికెట్లు అందించారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు అతి త్వరలోనే క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులు అందిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలోని ఆర్టీసీ డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఇప్పటికే రోజుకు దాదాపు 18 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, ఈ సంఖ్య రాబోయే రోజుల్లో 26 లక్షలకు పెరుగుతుందని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com