భారీగా ఆదాయం కోల్పోనున్న ఏపీఎస్‌ఆర్టీసీ

తెలుగు రాష్ట్రాల మధ్య ఏడు నెలలుగా... ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. రవాణా కార్యకలాపాలు చాలా రోజుల ముందే మొదలైనప్పటికీ... అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకుంటేనే బస్సులు అనుమతిస్తామని తెలంగాణ చెప్పడంతో సర్వీసుల పునరుద్ధరణ కుదరలేదు. ఒప్పందంపై పలుమార్లు చర్చించిన అధికారులు.... కిలోమీటర్లపై కొంతకాలం క్రితం వరకు నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాలు సమానంగా లక్షా అరవై వేల కిలోమీటర్ల మేర నడపాలని నిర్ణయానికి వచ్చినా.. రూట్ల వారీగా బస్సుల వివరాలు ఇవ్వాలని తెలంగాణ కోరడంతో... కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తర్వాత రూట్ల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ.. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చించి ఆమోదముద్ర వేయాల్సి ఉంది..
కొత్త ప్రతిపాదనల కారణంగా ఏపీ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలకు నడిపే సర్వీసులను ఏపీఎస్ ఆర్టీసీ భారీగా తగ్గించనుంది. గతంలో 1009 బస్సులను 2లక్షల 65వేల 367 కిలోమీటర్ల మేర తెలంగాణ భూభాగంలో నడుపుతుండగా.. తాజా ప్రతిపాదన వల్ల 638 సర్వీసులు లక్షా 60 వేల 999 కిలోమీటర్లకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 746 సర్వీసుల్ని లక్షా 52 వేల 344 కిలోమీటర్లు మేర ఏపీ పరిధిలో తెలంగాణ ఆర్టీసీ తిప్పుతుండగా.. తాజాగా 76 సర్వీసులను 8 వేల కిలోమీటర్ల మేర పెంచనుంది. మొత్తంగా ఇరు రాష్ట్రాల మధ్య 295 సర్వీసులు తగ్గనున్నాయి..
ఇక... లాక్‌డౌన్ ముందు వరకు విజయవాడ- హైదరాబాద్ మార్గంలో రోజూ 374 సర్వీసులు... లక్షా 3వేల 702 కిలోమీటర్ల మేర ఏపీఎస్‌ఆర్టీసీ తిప్పేది. ఇకపై 192 బస్సులను 52వేల 524 కిలోమీటర్లు మాత్రమే నడపనుంది. ఈ ఒక్క రూట్‌లోనే 182 సర్వీసులు...., 51వేల178 కిలోమీటర్ల పరిధి తగ్గనున్నాయి. గతంలో ఈ మార్గంలో టీఎస్‌ఆర్టీసీ 162 బస్సులను 33వేల 736 కిలోమీటర్ల మేర తిప్పేది. ఇప్పుడు 273 సర్వీసులకు పెంచారు. ఇకపై ఏపీతో సమానంగా 52వేల 384 కిలోమీటర్ల మేర బస్సులు నడవనున్నాయి. రెండు రాష్ట్రాలు కలిసి 32వేల 530 కిలోమీటర్ల మేర సర్వీసులు నడపలేని పరిస్థితి ఏర్పడనుంది. రాయలసీమ రూట్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉండబోతోంది. తాజా ప్రతిపాదనల వల్ల ప్రైవేటు ఆపరేటర్లు లాభపడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఆర్టీసీకి స్వల్పంగా ఆదాయం పెరిగినా ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం భారీగా ఆదాయం కోల్పోనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com