Chandrababu: మద్యం కేసులో ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు

Chandrababu: మద్యం కేసులో  ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు
రాజకీయ కక్షతోనే వరుస కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు తరపు లాయర్

మద్యం దుకాణాల లైసెన్స్‌దారులకు 2015-17 సంవత్సరాల్లో ప్రివిలేజ్‌ ఫీజు తొలగింపు ఫైలును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు పంపలేదని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అప్పటి సీఎంను బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. పిటిషనర్‌పై ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారని....బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు

మద్యం కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై.... హైకోర్టులో వాదనలు కొనసాగాయి. మద్యం దుకాణాల లైసెన్స్‌దారులకు 2015-17 సంవత్సరాల్లో ప్రివిలేజ్‌ ఫీజు విధింపు నిబంధన తొలగింపునకు ప్రతిపాదించిన ఫైలు... అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లలేదని ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి, కమిషనర్‌ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఫైలును ఆర్థిక శాఖకు పంపకపోవడాన్ని సీఐడీ ఆక్షేపించడం సరికాదని, ఈ విషయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అందుకు అప్పటి సీఎం, మంత్రిని బాధ్యులను చేయడం సరికాదన్నారు. ప్రివిలేజ్‌ ఫీజు తొలగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగినట్లు 2021లో కాగ్‌ వెలువరించిన తుది నివేదికలో పేర్కొనలేదని చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు.

2019 కాగ్‌ ముసాయిదా నివేదికలోని అంశాలను చూపుతూ సీఐడీ కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని వివరించారు. విడతల వారీగా లైసెన్స్‌ ఫీజు బకాయిలు చెల్లించేందుకు ఎస్పీవై ఆగ్రోస్‌ సంస్థకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్‌ ఆమోదం ఉందని వివరించారు. పిటిషనర్‌పై రాజకీయ ప్రతీకారంతో గత నెలన్నర కాలంలో ఆరు కేసులు నమోదు చేశారని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్‌ నుంచి మార్చి 2015 మధ్య తొమ్మిది నెలల కాలానికి ప్రివిలేజ్‌ ఫీజు రూపంలో 11 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. 2015-17 మధ్య మూడేళ్లకు ప్రివిలేజ్‌ ఫీజును తొలగించడం ద్వారా 15 వందల కోట్ల ఆదాయం కోల్పోయినట్లు సీఐడీ చేస్తున్న వాదన అర్థరహితమని వివరించారు.పిటిషనర్‌పై దురుద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్‌పై కేసు నమోదు చేయాలంటే అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17ఏ ప్రకారం కాంపిటెంట్‌ అథారిటీ నుంచి అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. ప్రస్తుత కేసు విషయంలో అలా చేయలేదని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ నిర్ణయంతో మద్యం దుకాణాలు, బార్‌ లైసెన్స్‌ యజమానులు అనుచిత లబ్ధి పొందారన్నారు. విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున పిటిషనర్లకు బెయిలు ఇవ్వొద్దని కోరారు. మౌఖికంగా తెలిపిన వివరాలను రాతపూర్వకంగా కోర్టు ముందుంచాలని పిటిషనర్లకు సూచించిన న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story