Ap News : ఆరోగ్యమిత్రలకూ తప్పని సమస్యలు

Ap News : ఆరోగ్యమిత్రలకూ తప్పని సమస్యలు
ఉద్యోగ భద్రత లేదంటూ ఆవేదన

ఆరోగ్యమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాకా ఏదో మొక్కుబడిగా వేతనాలు పెంచి చేతులు దులుపుకున్నారు. పైగా జీతాలు గీతదాటాయంటూ సంక్షేమ పథకాలకు కోత పెట్టారు. బండెడు చాకిరీ చేయిస్తున్నారు. మాట తప్పిన మడమ తిప్పిన జగనన్న పుణ్యమా అని క్రమబద్ధీకరణ కాక.. వేతనాలు సరిపోక.. అటు సంక్షేమ పథకాలూ అందక కష్టాలతో అల్లాడిపోతున్నారు ఆరోగ్యమిత్రలు.

జనవరి 21, 2016న నెల్లూరులో ప్రతిపక్షంలో ఉండగా తనను కలిసిన ఆరోగ్యమిత్రలకు ఉద్యోగాల క్రమబద్ధీకరణపై జగన్‌ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి వైకాపా అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది 'ఓడ దాటేదాక ఓడ మల్లన్న' ఓడ దాటాక బోడి మల్లన్న' అన్నట్లుగా జగనన్న ఆరోగ్యమిత్రలకు ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. పదవీకాలం ముగిసి మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాఆరోగ్యమిత్ర ఉద్యోగ భద్రతపై నోరు మెదపడం లేదు. మాటలకు చేతలకు పొంతనలేని జగనన్న పుణ్యమా అని.....

అరకొర వేతనాలతోనే వారు కాలం వెళ్లదీస్తున్నారు. ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ... అధికారులకు పదేపదే విజ్ఞాపనపత్రాలు అందచేస్తున్నారు. సీఎంను కలుసుకునేందుకూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారు. డిగ్రీ అర్హతతో ఆహ్వానించిన దరఖాస్తుల మేరకు జిల్లాల్లో రాత పరీక్ష రాసి జిల్లా కమిటీల ద్వారా ఉద్యోగాలు చేస్తున్నారు. అనుబంధ ఆసుపత్రుల యాజమాన్యాలు, రోగులు, ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయం మధ్య అనుసంధానంగా పనిచేసే వీరికి మాత్రం ఉద్యోగ భద్రతలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2వేల 500 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం నెలకు వచ్చే 15వేల చాలీచాలని జీతంతోనే జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు.

ఆరోగ్య మిత్రలను ఆన్‌లైన్‌లో ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారు. దీనివల్ల వీరికి అమ్మఒడి కింద ఆర్థిక సాయం, పెన్షన్, ఆరోగ్యశ్రీ వంటి ఉచితంగా చికిత్స పొందే అవకాశాన్ని కోల్పోయారు. తెల్లరేషన్‌కార్డును కూడా వీరికి జారీ చేయడంలేదు. ఇతర ఉద్యోగాల భర్తీలో ఆరోగ్యమిత్రలుగా పనిచేసే వారికి ప్రాధాన్యం కూడా ఇవ్వడంలేదు. కొవిడ్‌ బాధితులకు వీరు కీలక సేవలు అందించారు. మరోవంక...ఆరోగ్యమిత్ర అనే ఉద్యోగం ప్రభుత్వం గుర్తించిన ఉద్యోగ కేటగిరిల జాబితాలో లేనేలేదు.

దీనివల్ల వీరికి అసలు ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. డిగ్రీ అర్హత కలిగినప్పటికీ పొరుగుసేవల కింద పనిచేస్తున్నారు...ఆరోగ్యమిత్రల్లో కొందరు కొద్దికాలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పనిచేశారు. అయితే.. అక్కడ వీరి సేవలు అవసరంలేదన్న కారణంతో అక్కడి నుంచి తప్పించారు. ఈ క్రమంలో కొందరిని దూర ప్రాంతాల్లోని ఇతర ఆసుపత్రులకు బదిలీచేశారు. దీనివల్ల ఇళ్ల నుంచి రాకపోకలు సాగించేందుకు కొందరు నెలకు రవాణా ఖర్చుల కింద 2వేల నుంచి 3వేల వరకు ఖర్చు పెడుతున్నారు. నెలకు వచ్చే 15వేల్లో రవాణా ఖర్చులుపోను మిగిలిన 12వేలతో కుటుంబాలను ఎలా నడపగలగమని ఆరోగ్యమిత్రలు ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యమిత్ర హోదాకు తగ్గ కేటగిరి సృష్టించాలని, హామీ ఇచ్చిన ప్రకారం..ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఆరోగ్యమిత్రలు సీఎం జగన్‌ను అభ్యర్థిస్తున్నారు

Tags

Next Story