Atchannaidu: డీఎస్పీల బదిలీలపై ఈ సీ కి అచ్చెన్నాయుడు ఫిర్యాదు

Atchannaidu: డీఎస్పీల బదిలీలపై ఈ సీ కి అచ్చెన్నాయుడు ఫిర్యాదు
విచారణ జరపాలని లేఖ

డీఎస్పీల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి కలిగేలా, వారికి అనుకూలంగా ఉండే డీఎస్పీలను కీలక ప్రాంతాల్లో నియమించారంటూ 10 మంది డీఎస్పీల పేర్లను సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీలపై అభియోగాలనూ లేఖలో పొందుపరిచారు. మొత్తం 42 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూవచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించాలని వారికి డీజీపీ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. తిరుపతి కలెక్టర్ లక్ష్మీశపై సీఈసీకి అచ్చెన్న మరో లేఖ రాశారు. స్థానిక ఎన్నికలు, తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు, బెదిరింపులకు పాల్పడ్డారని అంటువంటి వ్యక్తిని ప్రోటోకాల్ పక్కన పెట్టి కలెక్టర్ కలవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికెళ్లి కలెక్టర్ సన్మానించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతోనే భూమన గెలిచారని... ఈసారి ఆయన కుమారుడు పోటీలో ఉన్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో కలెక్టర్ లక్ష్మీశ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారనే నమ్మకం లేదన్నారు. అందువల్ల తిరుపతి కలెక్టర్ ను బదిలీ చేసి, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ప్రతిపక్షాలను వేధిస్తూ, వైకాపాకు అనూకులంగా వ్యవహరిస్తున్నారని సీఈసీకి ఇంకో లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలతో పరమేశ్వర్ రెడ్డికి ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story