AVINASH ARREST: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్

పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను హౌస్ అరెస్ట్ చేశారంటూ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను కార్యకర్తలు అడ్డుకోగా.. వారిని కూడా స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇవాళ జడ్పీటీసీ ఉపఎన్నిక పోలింగ్ వేళ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అవినాశ్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. జడ్పీటీసీ ఎన్నికల వేళ పులివెందుల మండలం ఎర్రిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్‌ను పలువురు నేతలు ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులను సైతం తరిమేస్తున్నారు. గ్రామంలో మహిళలపై దాడికి దిగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గ్రామంలో వారు ఓటు వేయకుండా నాయకులు అడ్డుకుంటున్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు.
నేతల హౌస్ అరెస్టులు
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ వేళ ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట సరిహద్దు, జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పులివెందులలో బందోబస్తును కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు.
30 ఏళ్ల తర్వాత పులివెందులలో ఎన్నికలు
పులివెందులలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు జరగుతున్నాయి. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడూ ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకు ఏకగ్రీవం అయ్యాయి. ఈసారి పులివెందుల కంచుకోటపై టీడీపీ జెండా ఎగురుతుందా? జడ్పీటీసీ స్థానం గెలిచి వైసీపీ పట్టు నిలుపుకుంటుందా? అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com