DC: ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ పటేల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను నియమించింది. కేఎల్ రాహుల్ కూడా స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2019 నుంచి ఢిల్లీ జట్టులో ఉన్న అక్షర్, IPLలో ఇప్పటివరకు 150 మ్యాచ్‌లు ఆడి 3,758 పరుగులు చేసి, 123 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో ఆయన నాయకత్వం ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
కెప్టెన్సీ నాకు చాలా గర్వకారణం: అక్షర్
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను కాసేపటి క్రితమే ప్రకటించారు. ఈ సందర్భంగా కెప్టెన్ హోదాలో అక్షర్ తన మొదటి ప్రకటన ఇచ్చారు. 'DCకి కెప్టెన్‌గా ఉండటం నాకు చాలా గర్వకారణం. నాపై నమ్మకం ఉంచినందుకు మా యజమానులు, సహాయక సిబ్బందికి నేను చాలా కృతజ్ఞుడను. ఈ జట్టును ముందుకు నడిపించగలనని నేను నమ్మకంగా ఉన్నాను.' అని పేర్కొన్నారు.
IPL 2025లో 10 మంది కెప్టెన్లు ఎవరంటే..?
10 IPL ఫ్రాంచైజీలలో ఐదు IPL 2025 కోసం కొత్త కెప్టెన్లను నియమించాయి. రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానె, అక్షర్ పటేల్, రిషబ్ పంత్ వరుసగా RCB, PBKS, KKR, DC, LSG జట్లకు నాయకత్వం వహిస్తారు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, పాట్ కమిన్స్, సంజు శాంసన్, శుభ్‌మాన్ గిల్ వరుసగా MI, CSK, SRH, RR, GTలకు నాయకత్వం వహించనున్నారు.
బుమ్రా ఐపీఎల్లో ఆడతాడా.. ? లేదా..?
ముంబై ఇండియన్స్ ప్రధాన బౌలర్ బుమ్రా.. ఐపీఎల్లో ఆడడం అనుమానంగా మారింది. వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా.. ఐపీఎల్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లు ఆడడని తెలుస్తోంది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతోంది. మార్చి 23వ తేదీన చెన్నైలో ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ వరకు బుమ్రా రెఢీ అవుతాడా కాదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఐపీఎల్ బహిష్కరించాలి: ఇంజమామ్ ఉల్ హక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను బహిష్కరించాలని పాక్ దిగ్గజ క్రికెటర్.. ఇంజమామ్ ఉల్ హక్ పలు దేశాల క్రికెట్ బోర్డులకు పిలుపునిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన అవమానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బీసీసీఐ తమ ఆటగాళ్లను విదేశీ టీ20 లీగ్‌లో ఆడేందుకు అనుమతించడం లేదని.. ఆయా బోర్డులు సైతం అదే వైఖరిని అవలంభించాలని ఇంజమామ్ సూచించాడు. దీనిపై ఏ బోర్డు ఇంత వరకూ స్పందించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com