BANAKACHARLA: తెలుగు రాష్ట్రాల మధ్య 'బనకచర్ల' చిచ్చు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదం రాష్ట్ర విభజన తర్వాత నుంచి కొనసాగుతున్న ప్రధాన సమస్యలలో ఒకటి. ఇటీవల ఏపీ సర్కారు ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌తో ఈ వివాదం మరింత ముదిరి పాకానపడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి వరద జలాలను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించాలని ఏపీ టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే, ఈ ప్రాజెక్ట్ గోదావరి జల వివాద ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 నిబంధనలను ఉల్లంఘిస్తుందని, తమ నీటి హక్కులకు భంగం కలిగిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
అసలు ఏమిటీ వివాదం...?
బనకచర్ల ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం సముద్రంలోకి వృథాగా పోయే 200 టీఎంసీల గోదావరి వరద జలాలను వినియోగించుకోవడం. ఏపీ ప్రభుత్వం ఈ నీటిని పోలవరం ప్రాజెక్ట్ నుంచి బొల్లపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు తరలించి, రాయలసీమలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని, ఇతర ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని ఏపీ వాదిస్తోంది. అయితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ తమ రాష్ట్రానికి గోదావరి, కృష్ణా నీటి వాటాలను తగ్గిస్తుందని, రైతులకు నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయపరంగా తెలంగాణ
ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు చట్ట, న్యాయపర చర్యలు చేపట్టేందుకు సిద్దమైంది తెలంగాణ ప్రభుత్వం. జనవరి 22, 2025న కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసిన తెలంగాణ, ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించాలని స్పష్టంగా కోరింది. జూన్ 18న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చించింది. జులై మొదటి వారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ ఇప్పటికే చెప్పారు. ఇదిలా ఉండగా, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం సముద్రంలోకి పోయే నీటినే తాము వినియోగిస్తున్నామని, ఈ ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు ఏ మాత్రం నష్టం జరగదని వాదిస్తున్నారు. తాజా పరిణామాలతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.
ప్రతిపక్షాల విమర్శలు
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 400 టీఎంసీల నీటిని ఏపీకి ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ఆంధ్రాకు తాకట్టు పెడుతోందని విమర్శిస్తున్నారు. బీజేపీ నేతలు ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం గమనార్హం. కేంద్రం ఈ వివాదంలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి, కృష్ణా నదులపై స్పష్టమైన నీటి కేటాయింపు నిర్ణయాలు, అపెక్స్ కౌన్సిల్ ద్వారా చర్చలు జరపడం ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం తెచ్చేందుకు ఉపయోగపడవచ్చు.నీటి వనరుల వినియోగంలో రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలి. రాజకీయ లబ్ధి కంటే రైతులు, ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. చట్టబద్ధమైన, న్యాయమైన పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. బనకచర్ల ప్రాజెక్ట్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సామరస్యానికి పరీక్షగా నిలుస్తోంది. దీనిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకుంటే నీటి వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది.
గేమ్ ఛేంజర్ అవుతుంది : చంద్రబాబు
బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ‘గేమ్ ఛేంజర్’ అవుతుందని సీఎం చంద్రబాబు ఇటీవల తెలిపారు. దేశంలోని అతిపెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా అవతరిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. గోదావరి వరద నీటిని మాత్రమే తరలిస్తామని, ఈ ప్రాజెక్ట్ కారణంగా తెలంగాణకు ఏ మాత్రం నష్టం ఉండదని స్పష్టం చేశారు. రెండు నుంచి మూడు నెలల్లోనే టెండర్లు పిలవడానికి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్తి చేసి టెండర్లు పిలుస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకునే సమయంలో ఏపీ నుంచి ఏ విధమైన అభ్యంతరాలను చెప్పలేదని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రానికి నివేదిక పంపిస్తున్నామని, హైబ్రిడ్ విధానంలో నిధుల సమీకరణకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణకు గల అనుమానాలను నివృత్తి చేయాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తమ రాష్ట్ర నీటి హక్కులను బనకచర్ల ప్రాజెక్టు హరిస్తుందని తెలంగాణ చేస్తున్న ఆరోపణలను సీఎం చంద్రబాబు ఖండించారు. తెలుగు రాష్ట్రాల పట్టింపులతో బనకచర్ల వివాదం తీవ్రమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com