BANAKACHARLA: బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేం

ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్‌కు తేల్చిచెప్పింది. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిప్పిపంపింది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇవ్వాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పరిశీలించాల్సి ఉందని.. ఈ మేరకు సీడబ్ల్యూసీని అప్రోచ్ కావాలని ఏపీకి సూచించింది. సీడబ్ల్యూసీతో కలిసి ఫ్లడ్ వాటర్ అవేలబులిటి అస్సెస్ చేయాలని పేర్కొంది. అంతరాష్ట్ర జల వివాదానికి క్లియరెన్స్ తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది.
కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రం
ఏపీ పోలవరం-బనకచర్ల ప్రతిపాదనపై జీకే చక్రపాణి నేతృత్వంలోని ఈఏసీ ఈనెల 17న వర్చువల్‌గా సమావేశమై చర్చించింది. ఏపీ ప్రతిపాదనలతోపాటు అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈమెయిల్స్, వివిధ మార్గాల్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించింది. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి ట్రైబ్యునల్ 1980 తీర్పునకు విరుద్ధమంటూ ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ముంపు సమస్య, న్యాయపరమైన వ్యవహరాలు ఉన్నాయని పేర్కొంది. సీడబ్ల్యూసీని సంప్రదించి వరదజలాలను సమగ్రంగా అంచనా వేయాలని కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ ప్రభావ అంచనా, టీవోఆర్, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారాలకు సీడబ్ల్యూసీని సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు పోలవరం-బనకచర్ల ప్రతిపాదనను కేంద్రం ఏపీకి తిప్పి పంపింది.
ఇటీవలే చంద్రబాబు సమావేశం
ఇటీవలే కేబినెట్ సమావేశం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు మీద రెచ్చగొట్టే ధోరణి వద్దు అని ఆదేశించారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టు గురించి వివరించాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు.
స్వాగతించిన హరీశ్ రావు
మరోవైపు ఈ ప్రాజెక్టుకు కేంద్ర నిపుణుల కమిటీ అనుమతులు ఇవ్వలేమని చెప్పాడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు సమర్థించారు. సీడబ్ల్యూసీ, జీడబ్ల్యూడీటీ పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు పూర్తి ఆధారాలతో నిలదీయం వల్లనే కేంద్రం దిగివచ్చిందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com