విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన నౌక

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన నౌక

బంగ్లాదేశ్ కు చెందిన 80 మీటర్ల పొడవైన నౌక విశాఖలోని తెన్నేటిపార్క్ తీరంలో రాళ్ల మధ్య చిక్కుకుంది. ఈ నెల 12న అర్ధరాత్రి సమయంలో సముద్రంలో వీచిన ఈదురు గాలుల ధాటికి షిప్ యాంకర్ చైన్ తెగిపోవడంతో తెన్నేటి పార్క్ సమీపంలోకి కొట్టుకుని వచ్చింది. ఈ షిప్ లో 41 మెట్రిక్ టన్నుల ఫ్యూయల్ ఆయిల్ మరియు 9 మెట్రిక్ టన్నుల డీజిల్ అయిల్ ఉంది. అయితే దీన్ని తొలగిస్తే తప్ప నౌకను సురక్షితంగా కదిలించడం అసాధ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో నౌక లోని అయిల్ ను తీసేందుకు మెస్సర్స్ ఎం.ఎస్ గిల్ మెరైన్ కు బాధ్యతలు అప్పగించారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వ సంస్ధల నుంచి పొందింది. ఐతే షిప్ ఉన్న ప్రదేశానికి చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో తాత్కాలికంగా ఒక రోడ్డును ఏర్పాటు చేశారు. షిప్ చుట్టూ ఎటువంటి అయిల్ లీకేజీ లేకుండా చూసేందుకు విశాఖ పట్నం పోర్టు ట్రస్టు నుంచి అవసరమైన సుశిక్షితులైన సిబ్బందిని పరికరాలను పంపించారు. దశలవారీగా షిప్ నుంచి ఆయిల్ ను తొలగిస్తున్నారు.

బీచ్ లో ఎలాంటి ఆయిల్ కలవకుండా బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ షిప్ లోని ఆయిల్ ను తీసి వేసిన తరువాత షిప్ ను తిరిగి సముద్రంలోకి తీసుకువెళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకూ షిప్ లోనికి నీరు చేరడం గానీ షిప్ నుంచి ఆయిల్ లీకేజీ వంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. బంగ్లాదేశ్ కు చెందిన 15 మంది సిబ్బంది ఇప్పటికీ షిప్ లోనే ఉన్నారు. షిప్ లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ఎం.ఎస్ గిల్ మెరైన్ సంస్ధ ఒక జనరేటర్ ను ఏర్పాటు చేసింది. పునరుద్దరణ ప్రక్రియ జరగడం వల్ల భద్రతాకారణాల దృష్ట్యా తెన్నేటి పార్క్ లోకి పబ్లిక్ ను ఎవ్వరినీ అనుమతించడంలేదు.

Tags

Next Story