TTD: వెయ్యి గోవులిస్తా.. టీటీడీ డెయిరీ పెట్టండి

TTD: వెయ్యి గోవులిస్తా.. టీటీడీ డెయిరీ పెట్టండి
X
బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ కీలక ప్రతిపాదన... మరో లక్ష గోవులను ఉచితంగా సమకూర్చే బాధ్యత తీసుకుంటానని హామీ

తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ కీలక ప్రతిపాదన చేశారు. టీటీడీ తరపున సొంత డెయిరీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ప్రభుత్వం దీనికి సిద్ధమైతే తన తరఫున వేయి గోవులను ఇస్తానని.. మరో లక్ష గోవులను ఉచితంగా సమకూర్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు. లక్ష గోవులతో రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల పాలు.. 30 వేల కేజీల నెయ్యి ఉత్పత్తి చేయొచ్చని అన్నారు. వెయ్యి ఆవుల్నిస్తా.. టీటీడీకి సొంత డెయిరీని పెట్టి.. ఆ నెయ్యినే లడ్డూ ప్రసాదాల తయారీకి వాడాలని లేఖలో పేర్కొన్నారు.

లేఖలో ఇంకా ఏముందంటే..?

తిరుమలలో రోజుకు 50 వేల నుంచి లక్ష మంది వరకూ భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని... సగటున రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకూ రోజువారీ ఆదాయం ఉంటుందని లేఖలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ తెలిపారు. అలాంటి పుణ్యక్షేత్రంలో సొంత డెయిరీ ఎందుకు పెట్టుకోకూడదని ప్రశ్నించారు. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటుకు ప్రభుత్వం రెడీగా ఉంటే.. తన వంతు బాధ్యతగా వెయ్యి ఆవులను ఇస్తానన్నారు. మరో లక్ష ఆవుల్ని ఫ్రీ గా తిరుమలకు తరలించే బాధ్యతను కూడా తీసుకుంటానన్నారు. రోజుకు లక్ష ఆవుల నుంచి 10 లక్షల లీటర్ల ఆవుపాలు ఉత్పత్తవుతాయని.... వాటి నుంచి 50 వేల కేజీల వెన్న తీసినా.. సుమారు 30 వేల కేజీల నెయ్యి తయారవుతుందన్నారు. ఆ నెయ్యిని స్వామివారి ధూప, దీప, నైవేద్యాలకు వాడి.. మిగిలిన దాన్ని రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు కూడా పంపవచ్చన్నారు. ఇలా చేస్తే లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరగకుండా ఉంటుందని ఆయన అభిప్రాయాన్ని లేఖలో పేర్కొన్నారు. టీటీడీ పాలకమండలిలో రాజకీయ, వ్యాపార, కార్పొరేట్ వ్యక్తులు కాకుండా.. ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులు వంటి వారు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

తిరుమల అన్నదాన ప్రసాదంలో జెర్రి..!

తిరుమల అన్నదాన కేంద్రంలో పెట్టిన పెరుగు అన్నంలో జెర్రి వచ్చిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి కనిపించిందని తెలుస్తోంది. దీనిపై భక్తులు టీటీడీ సిబ్బందిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతోపాటు వెళ్ళిపోవాలని చెప్పినట్టు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నప్రసాదంలో జెర్రి వచ్చిందనే వార్త పూర్తిగా దుష్ప్రచారమని, వదంతులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Tags

Next Story