BETTING APPS: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు

BETTING APPS: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు
X
19 మంది బెట్టింగ్ యాప్‌ల ఓనర్లపై కేసు నమోదు... జీవితాలను నాశనం చేసుకోవద్దన్న ఏపీ డీజీపీ

లుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్‌ల ఓనర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సెలబ్రిటీలను సాక్షులుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసిన లిస్టులో మొత్తం 19 యాప్‌ల యజమానులున్నారు. జిగిల్‌ రమ్మి డాట్‌ కామ్‌, ఏ 23, యోలో 247, ఫెయిర్‌ ప్లే, జీత్‌విన్‌, విబుక్‌, తాజ్‌ 77, వివి బుక్‌, ధనిబుక్‌ 365, మామ247, తెలుగు 365, ఎస్‌365, జై365, జెట్‌ఎక్స్, పరిమ్యాచ్‌, తాజ్‌777బుక్‌, ఆంధ్రా365 యాప్‌ల యజమానులను నిందితుల జాబితాలో చేర్చారు.

బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ

బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. ఐపీఎల్ బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈజీగా డబ్బులు వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

బెట్టింగ్ గురించి సమాచారం ఇవ్వండి: ఎస్పీ

చిత్తూరు జిల్లాలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వి. ఎన్. మణికంఠ చందోలు తెలిపారు. క్రికెట్‌ను ఇష్టపడటం తప్పుకాదని, కానీ బెట్టింగ్ వ్యసనంగా మారితే జీవితం నాశనమవుతుందని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 లేదా చిత్తూరు పోలీస్ నంబర్‌ 9440900005 కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

బెట్టింగ్ యాప్స్ వలలో పడొద్దు: డీఎస్పీ

తక్కువ కాల వ్యవధిలో మంచి లాభాలు చూపించే బెట్టింగ్ యాప్ల వలలో పడి జీవితాలను నాశనం చేసుకొని, ఆత్మహత్యలు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. బెట్టింగ్ యాప్స్ మీద అవగాహన కల్పించేందుకు గౌస్ పీర్ సేన చేపట్టిన బెట్టింగ్ ఆప్లికేషన్లతో జాగ్రత్త అనే పోస్టర్ ని డీఎస్పీ ఆవిష్కరించారు. సామాజిక బాధ్యతతో సయ్యద్ గౌస్ పీర్ గారు మంచి కార్యక్రమం చేపట్టారని డీఎస్పీ అభినందించారు.

Tags

Next Story