Bhadradri: నేడు గోదావరిలో తెప్పోత్సవం

Bhadradri: నేడు గోదావరిలో తెప్పోత్సవం
ముక్కోటి ఏకాదశికి భద్రాద్రి రామాలయం ముస్తాబు..

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడికి భద్రాచలంలో నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగే ముక్కోటి ఉత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో డిసెంబర్ 13 నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జనవరి 2 వరకు జరగనున్నాయి.

భద్రాచలం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. డిసెంబర్‌ 13 నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు.. డిసెంబర్ 23 వరకు పగటిపూట నిర్వహించే ఉత్సవాలుగా.. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు రాత్రి నిర్వహించే ఉత్సవాలుగా జరపడం ఆనవాయితీ. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో భద్రాద్రి ఆలయం కొత్త అందాన్ని సంతరించుకుంది. ఆలయ ప్రాంగణం మొత్తం చలువ పందిళ్లు వేసి మామిడి తోరణాలు.. పూలమాలలతో అలంకరించారు. విశేష సంఖ్యలో వచ్చే భక్తుల కోసం భద్రాచలం పట్టణంలోని పురవీధుల్లో వివిధ ప్రాంతాల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారు.. రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. దశావతారాల్లో చివరి రోజు.. నిన్న శ్రీరామచంద్ర స్వామి వారు శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేడు గోదావరిలో సీతారాములకు హంసవాహనంపై తెప్పోత్సవం వేడుక నిర్వహించనున్నారు.


ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొనే భక్తుల కోసం.. గత నెల నుంచే టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచిన అధికారులు ఆలయ ప్రాంతాల్లోని కార్యాలయాల వద్ద కూడా నేరుగా టికెట్లు విక్రయిస్తున్నారు. తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తుల కోసం.. ప్రత్యేకంగా 2 లక్షల లడ్డు ప్రసాదాన్ని తయారు చేయించారు. తెప్పోత్సవం వేడుకకు, ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి సుమారు 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story