BHUVANESHWARI: ప్రధాని రాక మరిచిపోలేని జ్ఞాపకం: భువనేశ్వరి

BHUVANESHWARI: ప్రధాని రాక మరిచిపోలేని జ్ఞాపకం: భువనేశ్వరి
X
జీవితకాల జ్ఞాపకమన్న భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరుదైన ఘట్టంగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ప్రధాని స్వయంగా వెళ్లి నారా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడపడం రాజకీయంగానే కాక భావోద్వేగపరంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా తమ ఇంటికి దేశ ప్రధాని అతిథిగా రావడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి అని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రధాని రాక సందర్భంగా నారా కుటుంబంలోని మూడు తరాల సభ్యులు కలిసి మోదీకి ఘన స్వాగతం పలికారని ఆమె వెల్లడించారు. అధికారికతకు అతీతంగా, కుటుంబ సభ్యుడిలా ప్రధాని మోదీ అందరితో కలిసిమెలిసి మాట్లాడిన తీరు తమను ఎంతో ఆకట్టుకుందని భువనేశ్వరి తెలిపారు. ప్రేమ, ఆప్యాయతలతో నిండిన ఆ క్షణాలు తమ కుటుంబానికి మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు.

ఈ సందర్బంగా మరో ప్రత్యేక ఘట్టం కూడా చోటుచేసుకుంది. దివంగత ఎన్టీఆర్ ఆరాధించిన సీతారాముల విగ్రహాలకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మోదీ చేతుల మీదుగా ఆ విగ్రహాలకు పూజలు జరగడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని భువనేశ్వరి పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ శాంతి, సుభిక్షం కలగాలని ప్రధాని ప్రార్థనలు చేశారని తెలిపారు. మొత్తంగా ఈ పర్యటన రాజకీయ మర్యాదలను దాటి… కుటుంబ ఆత్మీయత, ఆధ్యాత్మికత, భావోద్వేగాల సమ్మేళనంగా నిలిచిందని నారా భువనేశ్వరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పర్యటనకు సంబంధించిన చిత్రాలు, వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story