BILL GATES: గన్నవరం చేరుకున్న బిల్‌గేట్స్..

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కీలక అడుగులు వేస్తున్న సమయంలో ప్రపంచ ప్రముఖ దాతృత్వవేత్త, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రాష్ట్ర పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐటీ, ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ పరిపాలన వంటి రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించేందుకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశమైంది.దక్షిణ కొరియా రాజధాని సీయోల్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన బిల్ గేట్స్ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్‌లో స్వల్ప అంతరాయం ఎదురైంది. రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్ కొంతసేపు విజయవాడ ఆకాశంలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించగానే విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉన్నతాధికారుల బృందం కూడా ఎయిర్‌పోర్ట్‌లో ఆతిథ్యం అందించింది.
కీలక సమావేశం
గన్నవరం నుంచి బిల్ గేట్స్ బృందం రోడ్డు మార్గంలో అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి బయలుదేరింది. ఉదయం 9:30 గంటలకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ లతో కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత పరిపాలన, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, ఆరోగ్య రంగంలో డిజిటల్ పరిష్కారాలు వంటి అంశాలపై సమగ్ర చర్చ జరగనుంది.రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే “స్వర్ణాంధ్ర విజన్”పై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని గేట్స్‌కు వివరించనున్నారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బలోపేతం, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి వంటి అంశాల్లో గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం విస్తరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
సచివాలయంలో జరిగే సమావేశాల అనంతరం సీఎం నివాసంలో గేట్స్ బృందానికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కార్యక్రమాలు ముగిసిన తర్వాత బిల్ గేట్స్ ఢిల్లీకి బయలుదేరనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
