BIRD FLU: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం

BIRD FLU: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం
X
మరింత అప్రమత్తమైన ప్రభుత్వాలు... వైరస్ గుర్తించిన చోట కరోనా తరహా నిబంధనలు

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఫ్లూ బారినపడి అనేకచోట్ల పెద్దఎత్తున కోళ్లు మృతిచెందుతున్నాయి. గోదావరి జిల్లాల్లోని రెండు కోళ్ల ఫారాలలో బర్డ్‌ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. తరువాత సమీప ఏలూరు జిల్లా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని కోళ్ల ఫారాల్లోనూ ఉన్నట్టుండి కోళ్లు చనిపోవడంతో వాటి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు . ఏపీలోని కోళ్లల్లో బర్డ్‌ ఫ్లూ కేసులు బయటపడటంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి కోళ్లు, గుడ్లు తమ రాష్ట్రంలోకి రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని రామకృష్ణ కోళ్ల ఫారంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని కృష్ణానందం కోళ్ల ఫారంలోనూ రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి.

10 కిలోమీటర్ల వరకు అలర్ట్‌ జోన్‌

బర్డ్‌ఫ్లూపై నివేదిక వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రెండు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. కలెక్టర్ల ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లోని పశు సంవర్ధకశాఖ, వైద్య ఆరోగ్యశాఖ,రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారు. ముందుగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బర్డ్‌ ఫ్లూ నిర్ధరణ అయిన పౌల్ట్రీల నుంచి కిలోమీటరు పరిధి వరకు పరిధి రెడ్‌ జోన్‌గా, అక్కడి నుంచి పది కిలోమీటర్ల వరకు అలర్ట్‌ జోన్‌గా ప్రకటించారు. రెడ్‌ జోన్‌ పరిధిలోని కోళ్ల పారాల్లోని అన్ని కోళ్లనూ, గుడ్లనూ పూడ్చిపెట్టాలని ఆదేశించారు.

కోళ్లకు బర్డ్ ఫ్లూ అని డౌటా.. ? ఈ నెంబర్లకు కాల్ చేయండి

రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ క్రమంగా విస్తరిస్తోంది. వైరస్ సోకి కోళ్లు, బాతులు మరణిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తితో ప్రజలు, కోళ్ల పెంపకందారులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో పశుసంవర్థక శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బర్డ్ ఫ్లూపై అనుమానాల నివృత్తి కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 08662472543, 9491168699 నెంబర్లకు కాల్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు.

Tags

Next Story