BIRDFLU: బాతులకు పాకిన బర్డ్ ఫ్లూ

ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతోంది. కర్నూలులో బర్డ్ ఫ్లూ సోకి దాదాపు 5,550కుపైగా కోళ్లు మృతి చెందాయి. దీంతో అధికారులు ఆ పౌల్ట్రీ ఫాంకు కిలో మీటర్ దూరం వరకు రెడ్ జోన్ ప్రకటించారు. మరోవైపు కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ సోకి 15 బాతులు మరణించినట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలిందని అధికారులు ధ్రువీకరించారు. రెడ్ అలర్ట్ జోన్లలో 8 బృందాలు బర్డ్‌ఫ్లూపై నిత్యం పర్యవేక్షిస్తున్నాయన్నారు. కర్నూలు నగరంలోని ఎనఆర్‌పేటలో కిలోమీటరు వరకు రెడ్ అలర్ట్ ప్రకటించామని అధికారులు వివరించారు. పరిసర ప్రాంతాల్లోనూ వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రెడ్ అలర్ట్ జోనలో 8 బృందాలు, సర్వే లైన్స జోనలో మరి కొన్ని బృందాలతో బర్డ్‌ఫ్లూపై నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. బాతులు, కోళ్ల వ్యాధులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా చెక్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌తో పాటు సరిహద్దు ఉన్న ఎన్టీఆర్ జిల్లా బోర్డర్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు, కోళ్ల ఉత్పత్తులు రాకుండా 12 చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. జిల్లాలో మృతి చెందిన కోళ్లను భూమిలో పూడ్చిపెడుతున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరుకి చెందిన ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందంటూ వస్తోన్న వార్తలను ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలిని ఖండించారు. అదంతా తప్పుడు ప్రచారమని వెల్లడించారు.
వెలవెలబోతున్న చికెన్ షాపులు
ముక్క లేనిదే ముద్ద దిగని తెలంగాణలో ఆదివారం చికెన్ షాపులు వెల వెలబోతున్నాయి. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. ప్రజలు మటన్, చేపల వైపు పరుగులు పెడుతున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండడంతో తెలంగాణ సర్కారు అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చికెన్ దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. నాణ్యతగా లేని చికెన్ విక్రయిస్తున్న వ్యాపారులపై ఫుడ్ సేఫ్టే విభాగం కొరడాను ఝులిపిస్తోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా వ్యాపారుల ధోరణి మారకపోవడంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మరోవైపు పలు షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా బయటపడినట్లు తెలిసింది. సుమారుగా 500 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను చూసి అధికారులు షాక్ అయ్యారు. వ్యాపారులపై కేసు నమోదు చేసిన అధికారులు.. కుళ్లిన చికెన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com