ప్రభుత్వం మారాక.. దివ్యాంగులకు నిలిచిపోతున్న ఆపరేషన్లు

దివ్యాంగులకు... ఉచిత వైద్యం అందించే తిరుపతి బర్డ్ ఆసుపత్రికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. ఈ రాజకీయ క్రీడల మధ్య రోగులు బలవడం ఆవేదన కలిగిస్తోంది. బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి ప్రతి ఏటా వివిధ రాష్ట్రాల నుంచి రోగులు వస్తుంటారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఇక్కడ శస్త్ర చికిత్సలు పూర్తిస్థాయిలో జరగడంలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు ఉచితమే అయినా.. తెరవెనుక వసూళ్లు పేద రోగుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
తుంటి ఆపరేషన్‌కు లక్ష.. మోకాలు ఆపరేషన్‌కు మరో లక్ష... నడుము ఆపరేషన్ అంటే లక్ష.. ఇలా.. ప్రతీ శస్త్రచికిత్సకు ఓ రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో చాలా సాధారణ ఫీజులు మాత్రమే ఉండేవి.. ఇప్పుడు దోపిడీ మరీ ఎక్కువైందంటున్నారు రోగులు. వికలాంగుల చికిత్స కోసం దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ బర్డ్ ఆసుపత్రిని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు తరలివస్తుంటారు.
ప్రభుత్వం మారాక.. బర్డ్ ఆసుపత్రి రాజకీయాల్లో చిక్కుకుంది. గతంలో ఉన్న డైరెక్టర్ జగదీష్‌ను రాజకీయాల కారణంగానే బయటికి పంపించారని ఆరోపణలున్నాయి. ఆతర్వాత ప్రైవేటు ఆసుపత్రికి చెందిన మదన మోహన్ రెడ్డిని బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్‌గా నియమించారు. వారంలో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండే కొత్త డైరెక్టర్‌తో పరిపాలన అంతా ఆస్తవ్యస్థంగా మారింది. గతంలో సుమారు రెండు వందల ఓపీలు.. రోజుకి 50కిపైగా ఆపరేషన్లు జరిగేవి. కరోనా వచ్చాక.. ప్రస్తుత పరిస్థితుల్లో.. రోగులు కూడా తగ్గిపోయారు. దేశంలోనే అత్యాధునిక పరికరాలు, ఆపరేషన్ థియేటర్లతో... ఆసుపత్రిగా పేరుగాంచిన బర్డ్ ఆసుపత్రి రాజకీయ గ్రహణంతో వెలవెలబోతోందని అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోగులపై నిర్లక్ష్యంతోపాటు.. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాల్లోనూ అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. పేద దివ్యాంగులకు ఉచిత సేవ చేయాల్సిన ఆసుపత్రిలో.. ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై వైద్యులు, రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com