BJP: జనసేనతో పొత్తుపై స్పష్టత ఇచ్చిన బీజేపీ

తెలంగాణలో రానున్న మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించడంతో, పొత్తులు–వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుందా? లేక భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తుందా? అనే అంశం ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి పొత్తు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితులు తెలంగాణకు వర్తించవని, ఇక్కడ మాత్రం బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చిచెప్పారు.
మేమే ప్రత్యామ్నాయం”
రామచందర్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాల కారణంగా కూటమి ఏర్పడినప్పటికీ, తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా భిన్నమని అన్నారు. స్థానిక పరిస్థితులు, ప్రజల మద్దతు ఆధారంగానే బీజేపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని ధీమా వ్యక్తం చేశారు.పొత్తుల అంశంపై జాతీయ స్థాయిలోనే నిర్ణయం తీసుకుంటారని, రాష్ట్ర స్థాయిలో అలాంటి అవసరం లేదని రామచందర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ బలం గురించి అధిష్టానానికి కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తామని చెప్పారు. భవిష్యత్‌లో ఎవరి నుంచైనా మద్దతు వస్తే, దానిపై జాతీయ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ–జనసేన మధ్య పొత్తు ఉండకపోవచ్చన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
జనసేన వ్యూహం
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా దూరంగా ఉండగా, జనసేన మాత్రం క్రమంగా తన అడుగులు విస్తరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనడం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగడం– ఇవన్నీ జనసేన దీర్ఘకాలిక వ్యూహాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న జనసేన, అక్కడ బీజేపీతో పొత్తు విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఏపీలో జనసేనతో కలసి పోటీకి బీజేపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం ఉంది. ఇదే సమయంలో తెలంగాణలో జనసేన స్వతంత్రంగా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుండటం, భవిష్యత్‌లో రెండు రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ దారులు కనిపించే అవకాశాన్ని సూచిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

