ఆంధ్రాలో దూకుడు పెంచిన బీజేపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ స్పీడ్ పెంచుతోంది. వరుస బహిరంగ సభలతో హీట్ పుట్టిస్తోంది. నిన్న శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా పర్యటించగా.. ఇవాళ విశాఖకు రాబోతున్నారు అమిత్‌షా. రెండు రోజుల్లో ఇద్దరు బీజేపీ అగ్ర నేతలు పర్యటిస్తుండటంతో ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
నిన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నిన్న శ్రీకాళహస్తిలో పర్యటించారు. బీజేపీ మహాసంపర్క్ అభియాన్ సభలో పాల్గొన్న ఆయన.. మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయి.. స్కామ్‌లు నడుస్తాయని మండిపడ్డారు. అభివృద్ధితో మోదీ దేశాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. వైసీపీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు జేపీ నడ్డా.
మరోవైపు ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. విశాఖ వేదికగా జరగనున్న బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ సభలో పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 8 గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు అమిత్‌షా. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. అయితే.. విశాఖ సభలో అమిత్ షా ఏం మాట్లాడతారన్నది హాట్ టాపిక్‌గా మారింది. శ్రీకాళహస్తి సభలో పాల్గొన్న జేపీ నడ్డా.. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దాంతో.. అమిత్ షా ప్రసంగంపైనా అంచనాలు పెరుగుతున్నాయి. విశాఖ సభలో నడ్డా ప్రసంగానికి కొనసాగింపుగా అమిత్‌షా స్పీచ్ ఉంటుందా?.. అన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో ఉత్కంఠ రేపుతోంది.
ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా ప్రధాన పార్టీలు మాత్రం ముందుగానే అలెర్ట్ అయ్యాయి. ఈ నేపధ్యంలో.. పొత్తులపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించగా, టీడీపీ, జనసేన పొత్తులు దిశగా ముందుకు వెళ్తున్నాయి. సీట్ల వ్యవహారం సర్దుబాటు అయిన తర్వాత అధికారికంగా పొత్తుల వ్యవహారాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు.. బీజేపీ కూడా కలిసి వచ్చేలా టీడీపీ, జనసేన ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే.. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తులు గురించి చర్చించినట్లు ప్రచారం జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com