Vijayawada : బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం

Vijayawada  : బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం
ఏకంగా పోలీసులపైనే దాడి

విజయవాడ బస్టాండ్‌లో బ్లేడ్‌బ్యాచ్‌, యాచకులు వీరంగం సృష్టించారు. మద్యం తాగి రాత్రంతా బస్టాండ్‌లో ఉన్న బెంచీలను ఆక్రమించి, వాటిపై పడుకుంటూ రాకపోకల సాగించే ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పోలీసుల సాయంతో అధికారులు వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.

అయితే అక్కడి నుంచి కదిలేది లేదంటూ వందమందికి పైగా యాచకులు ఒక్కసారిగా బ్లేడ్‌లతో ఆదివారం తెల్లవారుజామున దాడికి దిగారు. యాచకుల దాడితో పోలీసులు, ఆర్టీసీ అధికారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ దాడిలో ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ వై.శ్రీనివాసరావు, పొరుగుసేవల సిబ్బంది సాంబయ్యకు, గాయాలు అయ్యాయి.

అదనపు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవటంతో బ్లేడ్‌బ్యాచ్‌, యాచకులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి పాల్పడ్డ వారిలో కొందరిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. యాచకులకు ఆర్టీసీ సిబ్బందికి మధ్య గంటపాటు జరిగిన ఘర్షణతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్టాండ్ నుంచి పంపించటాన్ని నిరసిస్తూ యాచకులు ఆందోళనకు దిగారు. దాదాపు గంటసేపు అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. ప్రయాణికులు కూడా ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదనపు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి బ్లేడ్ బ్యాచ్ యువకులు పరుగులు తీశారు. అయితే పోలీసులు వారిలో కొందరిని పట్టుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఇటీవల కాలంలో బస్టాండ్ లలో రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రయాణికుల ఫిర్యాదుతో ఈరోజు ఈ వ్యవహారం బయటపడింది. ఇకపై ఆర్టీసీ బస్టాండ్ లో పటిష్ట నిఘా పెడతామంటున్నారు పోలీసులు. ఆర్టీసీ సిబ్బంది కూడా అదనపు భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. రైల్వేస్టేషన్ లలోకి యాచకులను రానివ్వకపోవడంతో వారంతా బస్టాండ్ కు వస్తున్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story