AP: జెత్వానీ కేసులో మరిన్ని సంచలన విషయాలు

AP: జెత్వానీ కేసులో మరిన్ని సంచలన విషయాలు
X
రేప్‌ కేసు వెనక్కి తీసుకోవాలని వేధించారు... వాంగ్మూలంలో కాదంబరీ జెత్వానీ

సినీ నటి కాదంబరీ జెత్వానీ.. వేధింపుల కేసులో సంచలన విషయాలు బహిర్గతం అవుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌పై ముంబైలో పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకొనేలా చేసేందుకే... అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్‌ అధికారులు తనను వేధించారని కాదంబరి జెత్వానీ స్పష్టం చేశారు. ఈ కేసులో కీలక సాంకేతిక ఆధారాలను ధ్వంసం చేసేందుకే సినీనటి కాదంబరీ జెత్వానీపై విజయవాడ పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధించినట్లు స్పష్టమైంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీలపై ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి జెత్వానీ దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. సజ్జన్‌ జిందాల్‌పై పెట్టిన అత్యాచారం కేసు ఉపసంహరించుకోకపోతే మరిన్ని కేసులు బనాయిస్తామని విజయవాడ పోలీసులు తనను బెదిరించారని జెత్వానీ వాంగ్మూలంలో పేర్కొన్నారు.

తన కాల్‌డేటా రికార్డ్స్‌లోని నంబర్లన్నింటికీ ఫోన్లు చేస్తూ ముంబైలో పెట్టిన అత్యాచారం కేసును ఉపసంహరించుకోవాలని జెత్వానీని ఒప్పించండి. అంగీకరించకపోతే ఆమెపై మీమీ రాష్ట్రాల్లో ఫిర్యాదులిచ్చి కేసులు పెట్టండని బెదిరించారని తెలిపారు. తాము జైల్లో ఉన్నప్పుడు ఓ న్యాయవాదిని తన వద్దకు పంపించారని...ముంబై అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవాలంటూ అతనితోనూ చెప్పించారని ఆమె వాంగ్మూలంలో చెప్పారు. మమ్మల్ని అరెస్టు చేయడానికి ముంబయికి వచ్చిన బృందంలోని ఎస్సై షరీఫ్‌కు అప్పటి సీపీ కాంతిరాణా ఫోన్‌ చేశారని కాదంబరి తెలిపారు. కాదంబరీ జెత్వానీని అరెస్టు చేశారా? లేదా? ఆమె తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకున్నారా? వారు ఎక్కడున్నారు? ముగ్గురినీ వేర్వేరుగా ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనివ్వొద్దని కాంతి రాణా ఆదేశించారని జెత్వానీ వాంగ్మూలంలో తెలిపారు. దీంతో పోలీసులు మా ముగ్గురిని వేర్వేరు వాహనాల్లో ఇక్కడికి తరలించారు. ఎక్కడా కలుసుకోనివ్వలేదు. దారిలో తీవ్రంగా వేధించారు. అంతకుముందు పోలీసులు తమతోపాటు తెచ్చుకున్న ఫోర్జరీ డాక్యుమెంట్‌ను.. మా ఇంట్లో సోదాల్లో దొరికినట్లు చూపించారని వెల్లడించింది.

జైలు నుంచి విడుదలయ్యాక, బెయిల్‌ షరతుల మేరకు తాము ఇబ్రహీంపట్నంలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. తాము అక్కడ నోవా రెసిడెన్సీలో గదులు తీసుకుని ఉన్నామని తెలిసి ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, మరికొందరు పోలీసులతో కలిసి ఆ హోటల్‌పై రైడ్‌ చేశారన్నారు. తనను ఏ క్షణంలో ఎవరైనా తీసుకెళ్లే అవకాశముందని.. జాగ్రత్త అని కొందరు పోలీసులు హెచ్చరించారని వాంగ్మూలంలో జెత్వానీ పేర్కొన్నారు.


Tags

Next Story