BOTSA:"జగన్ నుంచే బొత్సకు ప్రాణహాని"

వైఎస్ జగన్ నుంచే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ప్రాణహాని ఉండొచ్చని టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. పైడితల్లి సిరిమానోత్సవంలో వేదిక కూలిన ఘటనలో తనకు అధికార పార్టీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బొత్సకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని తెలిపారు. కాకపోతే సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చన్నారు. ఈ విషయాన్ని బొత్స చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్ నుంచే ప్రాణ హాని ఉంటుందోమోనన్నారు. బొత్స రక్షణ కోరితే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. పైడితల్లి సిరిమానోత్సవంలో వేదిక కూలిపోవడంపై కలెక్టర్, ఎస్పీల బాధ్యతను ప్రశ్నించారు. ఈ విషయంపై గవర్నర్, సీఎస్‌లకు లేఖ రాస్తానని తెలిపారు. అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శించారని, ఆర్భాటం, అహంకారం తప్ప సాంప్రదాయాలకు తావివ్వలేదని విమర్శించారు. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ మండలి పక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. పైడితల్లి అమ్మవారి జాతరలో ప్రభుత్వం ప్రమాణాలు పాటించలేదని, సంప్రదాయాలను పక్కనబెట్టి అహంకారంతో వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలందరికీ పైడితల్లి అమ్మవారు ఇలవేల్పుగా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ఉత్సవాల సమయంలో రాజకీయాలు చేయదు.. కానీ, ఈసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం, అధికారులు సంప్రదాయాలను తుంచేశారు అని బొత్స విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, ఎమ్మార్వో, ఎండీవో, ఎక్సైజ్, ఇలా అన్ని శాఖల్లోనూ హుండీ పెట్టి డబ్బు సేకరణ చేయడం ఏమిటి? వీరు సివిల్ సర్వెంట్లా..? ఇది ధర్మమా? అని ప్రశ్నించారు. తనకి ఏర్పాటు చేసిన స్టేజ్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారని పేర్కొన్నారు.. ఈ విషయమై గవర్నర్, సీఎస్ లకు లేఖ రాస్తానన్నారు. ప్రభుత్వ అలసత్వమే దీనంతటికీ కారణం.
అధికారులపై ప్రభుత్వానికి పట్ట లేకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు . గోవా గవర్నర్ ఇంకా విజయనగరంలోనే ఉన్నారని.. గతంలో ఆయన చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు బొత్స. అధికారులకు ఆయన దిక్సూచిగా ఎందుకు నిలబడలేదని.. . అమ్మవారి దర్శనానికి సంబంధించి తన వ్యక్తిగత ప్రోటోకాల్‌పై తాను లేఖ రాశానని, దానికి అధికారులు తోచిన ఏర్పాట్లు చేశారని, అయితే ఉత్సవాల్లో ఏం జరిగిందో అందరూ చూశారన్నారు. తాము కూర్చున్న వేదిక కూలిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కుట్రనా, అధికారుల అలసత్వమా, లేక తమను అవమానించాలని చేసిన పనా, లేక అంతమొందించాలని చూశారా అని ప్రశ్నించారు. అధికారులు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వేదిక కూలిన ఘటనలో ఎమ్మెల్సీ సురేష్ బాబు చేయి డిస్ లోకేట్ అయిందని.. మరొకరికి ఫ్రాక్చర్ అయిందని, మరో అమ్మాయికి కూడా దెబ్బలు తగిలాయన్నారు. అమ్మవారి పండగ సందర్భంగా జరిగిన నిర్లక్ష్యం, అలసత్వం, కుట్ర అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బొత్స. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సరైనవి కావని, వీటిని ఉపేక్షిస్తే సమాజానికి నష్టమన్నారు.దీని వెనుక ఎవరున్నారనే పూర్తి వివరాలు బయటకు రావాలని, జిల్లా అధికారులను ప్రశ్నించారు. రాజకీయ నాయకులు వ్యక్తిగత ఆలోచనలతో మాట్లాడుతారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలను దిగజార్చడం సరికాదన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com