బ్రెయిన్‌డెడ్.. అమ్మా అన్న పిలుపు విని కనులు తెరిచి..

అమ్మకి ఏమైందో తెలియదు.. అమ్మమ్మ పెడితే తింటున్నాడు.. అమ్మ పలవరింతలతోనే పడుకుంటున్నాడు.. నాలుగు రోజులైనా అమ్మ ఇంటికి ఎందుకు రాలేదో తెలియదు.. బ్రెయిన్ డెడ్ అయి ఆస్పత్రి బెడ్ మీద ఉన్న తల్లి దగ్గరకు తీసుకువెళ్లారు. ఆమెను చూడగానే ఆత్రంగా అమ్మా అని పిలిచాడు.. ఆ పిలుపు విని తల్లి కళ్లు తెరిచింది.. అందరి కళ్లలో ఆనందం.. కానీ నీడలా పొంచి ఉన్న మృత్యువు ఆమెను బతకనివ్వలేదు.. తొందరపెట్టి తీసుకువెళ్లింది.
కాకినాడ జిల్లా అన్నవరం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది అఖిల. సహచర ఉపాధ్యాయులతో కలిసి సంకల్పం పేరిట స్వచ్ఛంద సేవలు నిర్వహించేవారు. గత శనివారం పదో తరగతి ఇన్విజిలేషన్ డ్యూటీ ముగించుకుని స్కూటీపై తిరిగివస్తోంది. అదే సమయంలో రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ అఖిల స్కూటీని ఢీకొట్టింది. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను హుటాహటిన ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు.
తన మరణానంతరం అవయవదానం చేయమని ముందుగానే కుటుంబ సభ్యులకు తెలపడం వలన వైద్యులు అందుకు సిద్ధమయ్యారు. ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళుతున్న సమయంలో ఆమె రెండేళ్ల కుమారుడిని తల్లి దగ్గరకు తీసుకు వచ్చారు. అమ్మా అని పిలిపించారు. దాంతో అఖిల చేయి కొద్దిగా కదపడంతో వైద్యులు అవయవ దానాన్ని నిలిపివేశారు. అనంతరం అఖిల వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది దాదాపుగా 40 శాతం వరకు కోలుకున్నారు. కానీ అంతలోనే పరిస్థితి విషమించి బుధవారం సాయిత్రం ఆమె మృతి చెందారు. బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com