BRS: బీఆర్ఎస్కు ఛాలెంజ్‌గా స్థానిక సమరం

2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత కొద్దినెలలకే వచ్చిన స్థానిక ఎన్నికలతో సత్తా చాటుకుని రాజకీయంగా గట్టి పునాది వేసుకున్న బీఆర్ఎస్ పార్టీకి.. ఈసారి స్థానిక ఎన్నికలు సవాల్ గా మారే పరిస్థితి కన్పిస్తోంది. పదేళ్ల అధికారం చేజారింది. ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే..ఓటమి నుంచి కాస్త తెరుకుని మళ్లీ రేసు మొదలు పెట్టింది కారు పార్టీ. ఇప్పటినుంచే సీరియస్‌గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు గులాబీ నేతలు. అయితే రాష్ట్రస్థాయిలో దూకుడు బానే ఉన్నా..రూరల్ పాలిటిక్స్‌ను మాత్రం పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎంతసేపు రాష్ట్రస్థాయిలో కాకుండా..గ్రామాల్లో పార్టీ క్యాడర్, లీడర్లకు భరోసా కల్పించేలా ఏ ఒక్క కార్యక్రమాన్ని గట్టిగా చేపట్టలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు గెలుచుకుంటే అందులో పది మంది కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. ఇంకో ఇద్దరు శాసనసభ్యుల అకాల మరణంతో బైపోల్స్ వస్తే అవి కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లాయి. ఇక బీఆర్ఎస్కు మిగిలింది 27 మంది ఎమ్మెల్యేలు. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే ఎమ్మెల్యేల చొరవతో పంచాయతీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయట. ఎమ్మెల్యేలు లేని చోట.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నచోట కారు క్యాడర్‌కు దిశానిర్దేశం చేసే దిక్కే కరువైందనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గ ఇంచార్జ్‌లలో చాలామంది యాక్టీవ్‌గా లేకపోవడం..నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేసి బీఆర్ఎస్ నేతలతోనే తిరుగుతుండటంతో అక్కడ గులాబీదళానికి దిశానిర్దేశం చేసేవారే కరువయ్యారు.
బాధ్యతల అప్పగింత ఎవరికి.?
జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎవరికీ బాధ్యతలు అప్పగించకపోవడంతో ఈ ఎఫెక్ట్ కూడా సర్పంచ్ ఎన్నికలపై పడుతుందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2017లో అప్పటి బీఆర్ఎస్ మహాసభల్లో ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గమే ఇప్పటికీ కొనసాగుతోంది. మూడున్నరేళ్ల క్రితం 2022 జనవరిలో బీఆర్ఎస్ అధిష్టానం 33 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. కానీ జిల్లా, పార్టీ అనుబంధ సంఘాలకు పూర్తి స్థాయి కార్యవర్గాలను మాత్రం నియమించలేదు. జిల్లాల్లో అన్ని రాజకీయ పార్టీలకు సంస్థాగతంగా కమిటీలున్నాయి. ఏడేళ్ల క్రితం బీఆర్ఎస్అధిష్టానం జిల్లా కమిటీలను రద్దు చేసి..పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర కార్యదర్శులకు పార్టీ బాధ్యతలను అప్పగించింది.
కొత్త వ్యూహాలు కావలెను
రాజకీయాలు చాలా డైనమిక్ గా ఉంటాయి. రాజకీయ పార్టీలకు చాలా బలంగా ఉన్న ఆయుధం ఏదైనా ఒక్క సారే ఉపయోగపడుతుంది. తెలంగాణ ఉద్యమం అనే కాన్సెప్ట్ మీద పార్టీని సుదీర్ఘంగా నడిపిన బీఆర్ఎస్ బాస్‌లకు ఇప్పుడా ఆయుధానికి కాలం చెల్లిందని తెలుసు. తెలంగాణ ఏర్పాటు అన్నది జరిగినప్పుడే ఇక తెలంగాణ వాదం లేకుండా పోయింది. ప్రత్యేక తెలంగాణనే సెంటిమెంట్ కు క్లైమాక్స్ అయినప్పుడు ఆ తర్వాత కూడా .. తెలంగాణ ప్రజల్నే బూచిగా చూపించి.. ఆ సెంటిమెంట్ రగిలించి చలికాచుకోవాలనుకోవడం అసాధ్యం అవుతుంది. బీఆర్ఎస్ గుర్తించడం లేదు. తెలంగాణ సమాజం ఉద్యమ క్రెడిట్ కేసీఆర్ ఒక్కరికే ఇచ్చేందుకు సిద్దంగా లేదు. ఆయన దీక్ష చేసిన మాట నిజమే కానీ.. వందల మంది ప్రాణ త్యాగం చేశారు. సకల జనుల సమ్మె జరిగింది. ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగం అయ్యారు. అందుకే.. ఆ క్రెడిట్ కేసీఆర్ లేదా బీఆర్ఎస్కు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఉద్యమానికి నాయకత్వం వహించినందున ఆ గౌరవం మాత్రం కేసీఆర్ కు ప్రజలు ఇస్తారు. అందుకే బీఆర్ఎస్ కు ప్రజలు మొదటి అవకాశం కల్పించారు. రెండో సారి కూడా రాజకీయ సమీకరణాలతో కలసి వచ్చింది. ఆ కారణంతో పదే పదే అధికారాన్ని ఇవ్వడానికి ప్రజలు సిద్ధపడలేదు.
కాంగ్రెస్ పాలనకు రెఫరెండమే..
కాంగ్రెస్ రెండెళ్ల పాలనకు రెఫరెండమ్ గా నిలిచిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం జోష్..కేంద్రం నిధుల సాధన క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమైంది. ముందుగా గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహిస్తుంది. దీంతో స్థానిక పోరులో మరోసారి అధికార కాంగ్రెస్ ను ఢీకొని తన ఉనికిని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ కు అనివార్యంగా మారింది. పై స్థాయి నాయకులు వలసలు పోయినా…గ్రామాల్లో కేడర్ మాత్రం బలంగా ఉందని నమ్ముతున్న బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో సైతం దెబ్బతింటే..కేడర్ కూడా వలస బాట పట్టే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో తిరిగి పుంజుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల వైఫల్యాలను, అవినీతిని ఎండగడుతునే..అంతకు మించి మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నాలు చేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

