BRS: గులాబీ దళపతి వ్యూహం ఏంటీ..?

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారిన విషయం మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారశైలి. కొంతకాలంగా ప్రజల ముందుకు రావడంలో మెల్లగా వ్యవహరిస్తున్న ఆయన, ఇప్పుడు ఒక్కసారిగా ఒక నేత చేరికకు ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా పార్టీ చేరికలను సాదాసీదాగా ముగించే కేసీఆర్, ఈసారి మాత్రం ప్రత్యేకంగా బహిరంగ సభ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న వ్యూహాలపై చర్చ సాగుతోంది. జనవరిలో ఒకసారి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత కేసీఆర్ మళ్లీ బయటకు రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా నదీ జలాల అంశంపై వరుస బహిరంగ సభలు నిర్వహిస్తానని ప్రకటించినప్పటికీ, అవి ఆచరణలోకి రాలేదు. అలాంటి పరిస్థితిలో జీవన్ రెడ్డి పార్టీ చేరిక సందర్భంగా జగిత్యాలలో సభ ఏర్పాటు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో ఏ నాయకుడి కోసం ఇలాంటి సభలు నిర్వహించని కేసీఆర్, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక స్పష్టమైన రాజకీయ లెక్కలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభావం గత ఎన్నికల్లో గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బలమైన స్థానం కలిగిన ఆ పార్టీ, ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ఈ పరిస్థితిని మార్చేందుకు బలమైన స్థానిక నాయకత్వాన్ని తిరిగి సమీకరించాల్సిన అవసరం పార్టీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి వంటి ప్రభావశీల నేతను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో మళ్లీ పట్టు సాధించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. జీవన్ రెడ్డికి ఉత్తర తెలంగాణలో మంచి పరిచయాలు ఉండటం, యువతలో ఫాలోయింగ్ కలిగి ఉండటం, అలాగే ఉద్యోగ సంఘాలతో సాన్నిహిత్యం ఉండటం వంటి అంశాలు బీఆర్ఎస్కు ఉపయోగపడతాయని పార్టీ అంచనా వేస్తోంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. , ఈ సభ ఉత్తర తెలంగాణలో పార్టీ బలాన్ని తిరిగి పెంచుకునే ప్రయత్నంగా భావించవచ్చు.
చాలా కాలం తరువాత ప్రజల్లోకి వస్తున్న ఆయన, ప్రస్తుత ప్రభుత్వంపై తనదైన శైలిలో స్పందించే అవకాశముంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిక ఈ సభలోనే జరిగే అవకాశం ఉండటంతో, ఈ కార్యక్రమం మరింత రాజకీయ రంగు సంతరించుకుంది. ఈ చేరికతో బీఆర్ఎస్కు కొత్త ఊపు వచ్చే అవకాశముండగా, కాంగ్రెస్‌కు ఇది ఒక సవాల్‌గా మారింది. జీవన్ రెడ్డి లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు బీఆర్ఎస్లో చేరడం, తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది కావచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో దీని ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ తన ప్రసంగంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు, తన పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
