AP: ఆంధ్రప్రదేశ్‌పై వరాల జల్లు

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌పై వరాల జల్లు కురిపించారు. ఏ బడ్జెట్‌లో లేని విధంగా ఒక ప్రత్యేక పేరా పెట్టి మరీ ఏపీకి నిధులు కేటాయించింది. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు అండగా నిలుస్తామని ప్రకటించింది. సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 4న తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి చేసిన విజ్ఞప్తులను యథాతథంగా ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో చేర్చి మరీ నిధులు కేటాయించి బడ్జెట్‌లో కేటాయించారు. అమరావతి నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.15 వేల కోట్లు సమకూరుస్తామని, పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏపీలో వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన మద్దతుగా నిలిచిన బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు ఈ బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసి, అక్కడి ప్రజల రుణం తీర్చుకొనే ప్రయత్నం చేసింది. ఈ రెండు రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్ వరుసగా వరాలు ప్రకటించడంతో సభలో కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు అక్కడి రైతుల జీవనాడి అయిన పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సమకూర్చడానికి, వేగంగా నిర్మాణం పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని నిర్మలా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించడానికి వీలుగా విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోని ఓర్వకల్లు నోడ్‌లకు అత్యవసర మౌలిక వసతులైన నీరు, విద్యుత్తు, రైల్వే, రహదారి కల్పనకు నిధులు అందిస్తామని తెలిపారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు అవసరమైన మూలధన వ్యయం కోసం ఈ ఏడాది అదనపు కేటాయింపులు చేస్తామన్నారు.
విభజన చట్టంలో చెప్పినట్లుగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రల్లో వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు అందిస్తామన్నారు. బిహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లతో కూడిన దేశ తూర్పు ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ పేరుతో ఒక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. మానవవనరుల అభివృద్ధి, మౌలిక వసతులు, ఆర్థిక అవకాశాలను కల్పించి ఈ ప్రాంతాన్ని వికసిత భారత్‌కు ఇంజిన్‌గా మారుస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com