జస్టిస్‌ జేకే మహేశ్వరికి ఘనంగా వీడ్కోలు.. తరలివచ్చిన అమరావతి రైతులు

జస్టిస్‌ జేకే మహేశ్వరికి ఘనంగా వీడ్కోలు.. తరలివచ్చిన అమరావతి రైతులు
జస్టిస్‌ జేకే మహేశ్వరికి అమరావతి రైతులు కూడా ఘనంగా వీడ్కోలు పలికారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి సిక్కిం హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి వీడ్కోలు సభ అమరావతిలో జరిగింది. హైకోర్టు సహచరులు, సిబ్బంది ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో జస్టిస్‌ జేకే మహేశ్వరి మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సామాన్య కుటుంబంలో పుట్టినా కష్టపడి ఈ స్థాయికి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. న్యాయమూర్తిగా విధుల్ని సమర్థంగా నిర్వహించానని, బదిలీ ఎవరికైనా బాధ కలిగించేదే అన్నారు. వ్యవస్థలు, సంస్థల ఉన్నతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. ఏపీ హైకోర్టులో పనిచేయడం సంతోషంగా ఉందని.. హైకోర్టు ప్రతిష్టను మరింత పెంచేందుకు ప్రయత్నించానని జస్టిస్‌ జేకే మహేశ్వరి చెప్పారు.

వీడ్కోలు సందర్భంగా సమావేశ మందిరంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. సహచర న్యాయమూర్తులను జస్టిస్‌ జేకే మహేశ్వరి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆయనకు సహచరులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.

మరోవైపు జస్టిస్‌ జేకే మహేశ్వరికి అమరావతి రైతులు కూడా ఘనంగా వీడ్కోలు పలికారు. హైకోర్టు వద్ద రోడ్డుకు ఇరువైపులా నిల్చొని.. జస్టిస్‌ జితేంద్ర కుమార్ లాంగ్ లివ్‌ అంటూ నినాదాలు చేశారు. న్యాయం పక్షాన పోరాడినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ జెండాలు పట్టుకుని మద్దతు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story