Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద ఈ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. అవినాష్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకే సీబీఐ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు అవినాష్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ.. గత 20 రోజులుగా విచారణ చేపట్టలేదు. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీస లిచ్చి విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లో ఉండగా, నేడు కడప జిల్లా పులివెందుల, లింగాల మండలాల్లో పర్యటనకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. వీటిని రద్దు చేస్తూ వైసీపీ శ్రేణులకు ఎంపీ కార్యాలయం నుంచి సమాచారం పంపారు. వివేకా కేసులో అవినాష్‌రెడ్డి పాత్ర, ప్రమేయంపై ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కౌంటర్‌లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. వివేకా కేసులో భారీ కుట్రకు అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి పాల్పడ్డారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అవినాష్‌రెడ్డికి నోటీసు ఇవ్వడంతో నేడు విచారణపై ఉత్కంఠ నెలకొంది. కాగా.. గత కొన్ని రోజులుగా విచారణకు విరామమిచ్చి ఢిల్లీ వెళ్లిన సీబీఐ బృందం నిన్న హైదరాబాద్‌కు చేరుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com