CBN: రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించండి

ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల సాధనే లక్ష్యంగా వరుసగా కేంద్ర మంత్రులతో కీలక భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, పెండింగ్‌లో ఉన్న నిధులు, జాతీయ ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర జల వివాదాలు, అలాగే రాజధాని అమరావతికి చట్టబద్ధత వంటి అంశాలు చంద్రబాబు పర్యటనలో ప్రధాన అజెండాగా నిలిచాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీలు రాజకీయంగా, పరిపాలనా పరంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో, ఆ బిల్లుకు సంబంధించిన అంశాలపై ఇరు నేతల మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశాల్లోనే బిల్లు..
పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రిని కోరినట్లు సమాచారం. అమరావతి రాజధానిగా కొనసాగడమే రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం సహకరించాలని చంద్రబాబు ఈ భేటీలో విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. దీనితో పాటు రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని కీలక అంశాలపై కూడా అమిత్ షాతో చర్చించినట్లు రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి భద్రత, రైతుల భవిష్యత్‌కు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, అనుమతులు, ఆర్థిక సహాయం వంటి అంశాలను చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఎత్తివేయాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమలులో అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయని, పనులు వేగవంతం కావాలంటే వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా వ్యయం పెరిగిందని, ఆ అదనపు వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ రూపంలో రాష్ట్రానికి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు కీలక ప్రతిపాదనలు
పోలవరం ప్రాజెక్టు ఫేజ్–IIకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ దశలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టల నిర్మాణం వంటి కీలక పనులు చేపట్టాల్సి ఉందని, వీటికి అదనంగా దాదాపు రూ.32 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని కేంద్ర మంత్రికి వివరించారు. పోలవరం పూర్తైతే రాష్ట్రంలోని కోట్లాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, తాగునీటి సమస్య కూడా శాశ్వతంగా పరిష్కారమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించడమే లక్ష్యంగా పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలు ఒకేసారి తీర్చే అవకాశం ఉందని చెప్పారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి, సాంకేతిక, ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
