CBN: తెలుగు వాళ్లే నెంబర్ వన్‌గా ఉండాలి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ప్రతిభ, శ్రమ, సంస్కృతి కలయికతో 2047 నాటికి తెలుగుసమాజాన్ని ప్రపంచంలోనే నంబర్‌వన్ కమ్యూనిటీగా నిలబెట్టాలన్న స్పష్టమైన లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. యూరప్‌లోని స్విట్జర్లాండ్ నగరం జ్యూరిక్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం, విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి పాత్ర, భారత ఆర్థిక భవిష్యత్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహాలపై సమగ్ర దృష్టిని ఆవిష్కరించింది. ఐటీ రంగంలో తీసుకున్న దూరదృష్టి నిర్ణయాల ఫలితంగా నేడు 195 దేశాల్లో తెలుగువారు ఉన్నారని, అదే పునాదిపై రాష్ట్రాన్ని గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు వివరించారు. జ్యూరిక్‌లో జరిగిన డయాస్పోరా సమావేశంలో మాట్లాడిన సీఎం, తన అనుభవాలను గుర్తుచేస్తూ 1995 నుంచి ఈ నగరానికి వస్తున్నానని చెప్పారు. అప్పట్లో యూరప్‌లో తెలుగువారి సంఖ్య చాలా తక్కువగా ఉండేదని, నేడు జ్యూరిక్లోనే కాదు స్విట్జర్లాండ్‌తో పాటు ఐర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీ, డెన్మార్క్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో వేల సంఖ్యలో తెలుగువారు నివసిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన జనసమూహాన్ని చూస్తే తెలుగు ప్రాంతంలోనే ఉన్నట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. తెలుగు డయాస్పోరా సంఘటిత శక్తిని వివరించిన చంద్రబాబు, ఒక్క జ్యూరిక్లోనే రెండు లక్షల మందికి పైగా సభ్యులతో నాన్-రెసిడెంట్ తెలుగు సంఘాలు ఉన్నాయని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా కలిపి సుమారు 400 తెలుగు సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని, ఇవన్నీ పరస్పర సహకారంతో సామాజిక సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యువత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. విదేశాల్లో జీవిస్తున్నా తెలుగు గుర్తింపును నిలుపుకోవడం మాత్రమే కాకుండా, ఆయా దేశాల అభివృద్ధిలో భాగస్వాములవుతూ గౌరవాన్ని సంపాదిస్తున్నారని ఆయన అభినందించారు. 1995లోనే ఐటీ రంగం భవిష్యత్తును గుర్తించి దానిపై దృష్టి పెట్టిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఆ సమయంలో తన ఆలోచనలను చాలా మంది ఎగతాళి చేశారని, కానీ అదే ఐటీని ప్రోత్సహించిన ఫలితంగా నేడు ప్రపంచంలోని 195 దేశాల్లో తెలుగువారు వివిధ రంగాల్లో కీలక స్థానాల్లో ఉన్నారని వివరించారు. ఐటీ మాత్రమే కాదు, విద్య, ఆరోగ్యం, పరిశోధన, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లలో కూడా తెలుగువారి ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఈ గ్లోబల్ నెట్వర్క్ దేశానికి, రాష్ట్రానికి గొప్ప ఆస్తిగా మారిందని వ్యాఖ్యానించారు. భారతదేశ ఆర్థిక భవిష్యత్తుపై కూడా చంద్రబాబు విశ్లేషణ చేశారు. భారత్‌కు అతిపెద్ద బలం యువ జనాభా అని, ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను సద్వినియోగం చేసుకుంటే దేశం వేగంగా ఎదుగుతుందని అన్నారు. 2028 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న అంచనాలను ఆయన ప్రస్తావించారు.
ఏపీ సిద్ధంగా ఉంది:లోకేశ్
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్2026 సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వసన్నద్ధమైందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీని ఒక నమ్మకమైన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ గమ్యస్థానంగా నిలపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతను గుర్తు చేస్తూ.. 90వ దశకంలోనే భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో ఆయన ఒకరని లోకేశ్ కొనియాడారు. కేవలం ఎంఓయూలపై సంతకాలు చేయడం కోసమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, సాంకేతిక పోకడలు ఏ దిశగా సాగుతున్నాయో అర్థం చేసుకునేందుకు దావోస్ ఒక గొప్ప వేదిక అని ఆయన అభిప్రాయపడ్డారు. దావోస్ సదస్సు అనేది అంతర్జాతీయ స్థాయి ఆలోచనల వినిమయానికి కేంద్రమని, ఇక్కడ జరిగే చర్చలు భవిష్యత్ నిర్ణయాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలతో దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి, స్థిరమైన ఆలోచనలను పంచుకోవడానికి ఈ వేదిక దోహదపడుతుందని వివరించారు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఎన్నో సవాళ్లు, ప్రశ్నలు తలెత్తుతాయని, వాటిని అధిగమించేందుకు అవసరమైన పరీక్షలు ఇక్కడే జరుగుతాయని లోకేశ్ వెల్లడించారు. బ్రాండ్ ఏపీని అంతర్జాతీయ స్థాయిలో తిరిగి పునరుద్ధరించడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉపాధి కల్పించడమే తమ అంతిమ ధ్యేయమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీకి భారీగా పెట్టుబడులు ఆకర్షించి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
