CBN: 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు

తమది పేదల ప్రభుత్వమని.. వారికి న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇళ్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలను కలిపేందుకు పక్కపక్కనే రెండు ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇంటిపై సోలార్ పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఇళ్లపై, పొలాల్లో కరెంట్ తయారు చేయిస్తున్నామని వివరించారు. సోలార్, విండ్, వాటర్‌తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కా గృహాల్లో గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మూడు లక్షల గృహాలను వర్చువల్‌గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 17 నెలల్లో ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఉగాది లోపు 5 లక్షల గృహ ప్రవేశాలు జరిగేలా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పేదవాడికి సొంతిల్లు ఉండాలి..
ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఒక్కరోజే రాష్ట్రంలో మూడులక్షల ఇళ్లకు గృహా ప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు. నిన్న(మంగళవారం) కనిగిరిలో 97 పరిశ్రమలు ప్రారంభించామని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు.మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే బాధ్యత తనదని పేర్కొన్నారు. 2029 నాటికి పేదలకి సొంతిల్లు ఉండాలనేది తన లక్ష్యమని నొక్కిచెప్పారు. ఇళ్లు అంటే నాలుగు గోడలు కాదని.. భవిష్యత్‌కు భద్రత అని అభివర్ణించారు. గృహనిర్మాణ రంగంలో కొత్త దశ ప్రారంభమవుతోందని, పేద కుటుంబాల కలల ఇల్లు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తుందని తెలిపారు. గతంలో, జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల స్థలాలు కేటాయించి వదిలేసారని, అక్కడ రోడ్లు, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆయన విమర్శించారు. అడవులు, చెరువుల దగ్గర స్థలాలు ఇచ్చి ప్రజల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆటలాడిందని మండిపడ్డారు.
వైసీపీ వల్లే...
కేంద్ర ప్రభుత్వం తాగునీటి పథకం ప్రవేశపెట్టినా గత ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. రాయచోటి నియోజకవర్గానికి త్వరలో ఇంటింటికి నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం తన జీవిత లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే గోదావరి – కృష్ణా అనుసంధానం విజయవంతమైందని, గంగా – కావేరి అనుసంధానం చేస్తే దేశం మొత్తానికి నీటి కొరత ఉండదని పేర్కొన్నారు.. మరోవైపు, గతంలో విద్యుత్ కష్టాలు ఉండేవి.. కానీ, ఇప్పుడు, ప్రతి ఇంటికి సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రైతులు తమ పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే, ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల రేటుకే కొనుగోలు చేస్తుందన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని.. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

