CBN: గంగా-కావేరి అనుసంధానం నా జీవిత లక్ష్యం

ప్రకృతిని పూజించే సంస్కృతి భారతీయులది, నదులను తల్లులుగా భావించే సంప్రదాయం తెలుగు ప్రజలది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభలో సాగునీటి రంగంపై జరిగిన విస్తృత చర్చ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నదుల అనుసంధానం తన చిరకాల స్వప్నమని వెల్లడించారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణా నదికి పవిత్ర హారతి ఇచ్చిన సందర్భాలను గుర్తు చేస్తూ, నీటి వనరుల పరిరక్షణ, వినియోగం విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. “గంగా-కావేరి అనుసంధానం నా ప్రగాఢ ఆకాంక్ష. చిన్న ఆలోచనలే పెద్ద మార్పులకు దారి తీస్తాయి. నదుల అనుసంధానం ద్వారా దేశంలో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది” అని సీఎం పేర్కొన్నారు. వంశధార నుంచి పెన్నా వరకు నదులను అనుసంధానం చేయగలిగితే రాష్ట్రంలో నీటి కొరత పూర్తిగా తొలగిపోతుందని అభిప్రాయపడ్డారు. నదులను కలిపి ‘తెలుగుతల్లికి జలహారతి’ ఇవ్వడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నిర్మించబడిన ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరించిన ఆయన, పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు 100 టీఎంసీల నీటిని తరలించిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని అందించామని, వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేసి ఇప్పుడు పూర్తి చేసే దశకు తీసుకొచ్చానని తెలిపారు. జూలైలో వెలిగొండ ఫేజ్-1 నుంచి నీటి విడుదల జరుగుతుందని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు 14 వారాల గడువు విధించామని, ప్రతి వారం పురోగతి నివేదికను స్వయంగా సమీక్షిస్తానని వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పురోగతి సాధించలేదని విమర్శించారు. గత పాలకులు రూ.2,500 కోట్ల పనులు పెండింగ్‌లో ఉంచి ‘జాతికి అంకితం’ అంటూ ప్రచారం చేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై సుమారు రూ.20 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధిపై కూడా సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాయలసీమను రాళ్లసీమగా మారకుండా దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. గాలేరు-నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారని చెప్పారు. రాయలసీమకు నీరు అందించిన తర్వాతే చెన్నైకి నీటిని తరలించామని వివరించారు. రాష్ట్రంలోని అనేక కీలక ప్రాజెక్టులు ఎన్డీయే లేదా తెలుగుదేశం హయాంలోనే పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులను ఈ టర్మ్‌లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును పుష్కరాల కంటే ముందే ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలవరం నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, ఎమ్మెల్యేలంతా ప్రాజెక్టును సందర్శించాలని సూచించారు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 66 ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
